ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ తన ఖాతాదారులకు షాకిచ్చింది. ఎస్‌బీఐ కస్టమర్లు ఫిబ్రవరి 28వ తేదీ లోగా తమ తమ కేవైసీ పత్రాలను బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆ ఖాతాలను నిలిపివేస్తామని ఎస్‌బీఐ తెలిపింది. కేవైసీ అసంపూర్తిగా ఉన్నవారు తమ పత్రాలను వెంటనే సమర్పించాలని ఎస్‌బీఐ సూచించింది. భవిష్యత్తులో జరిపే బ్యాంకింగ్ లావాదేవీల్లో ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా ఉండాలంటే కస్టమర్లు వెంటనే తమ కేవైసీ డాక్యుమెంట్లను అందజేయాలని ఎస్బీఐ తెలిపింది.
ఇటీవలి కాలంలో దాదాపుగా అన్ని బ్యాంకులూ తమ కస్టమర్లను కేవైసీ కోరుతున్నాయి. ఆర్‌బీఐ ఆదేశాల మేరకే బ్యాంకులు ఈ ప్రక్రియ చేపట్టాయి. అందుకనే తాము కూడా కస్టమర్ల కేవైసీ కోరుతున్నామని ఎస్‌బీఐ తెలిపింది. అందులో భాగంగానే ఇప్పటికే ఎస్‌బీఐ తన కస్టమర్లకు ఈ విషయంపై మెసేజ్‌లు, ఈ-మెయిల్స్ పంపిస్తోంది. ఈ క్రమంలో కస్టమర్లు ఎవరైనా సరే.. తమకు కేవైసీ అప్‌డేట్ చేయమని మెసేజ్ వస్తే నిర్లక్ష్యం వహించకుండా వెంటనే సమీపంలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లి తమ కేవైసీ అప్‌డేట్ చేసుకోవచ్చని ఆ బ్యాంక్ తెలియజేసింది.
ఇక ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ కస్టమర్లు తమ కేవైసీని ఆన్‌లైన్‌లోనూ అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో వినియోగదారులు ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్‌లను సమర్పించాల్సి ఉంటుంది. ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, టెలిఫోన్ బిల్లు, ఆధార్ కార్డు, పెన్షన్ పే ఆర్డర్, విద్యుత్ బిల్లు, ఫొటో కలిగిన బ్యాంక్ పాస్‌బుక్, పాన్ కార్డు తదితర పత్రాలను కేవైసీ కింద సమర్పించవచ్చు. ఈ క్రమంలో కస్టమర్ల కేవైసీ అప్‌డేట్ అవుతుంది..!