కరోనా సెకండ్ వేవ్ వల్ల ఓ వైపు జనాలు తీవ్రమైన మానసిక, శారీరక, ఆరోగ్య, ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంటే.. మరోవైపు మోసగాళ్లు మాత్రం తమ పని తాము కానిచ్చేస్తున్నారు. అవకాశం ఉన్నప్పుడల్లా, సందు దొరికితే చాలు రెచ్చిపోతున్నారు. విచ్చలవిడిగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఎంత అలర్ట్ గా ఉంటున్నప్పటికీ ఏదో ఒక కొత్త మార్గంలో జనాల నుంచి డబ్బును దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలు బ్యాంకులు తమ కస్టమర్లను సైబర్ నేరాల పట్ల హెచ్చరిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు జారీ చేశాయి.
ఎస్‌బీఐ కస్టమర్లు ఎక్కువగా క్యూఆర్ కోడ్ మోసాల బారిన పడుతున్నారని ఆ బ్యాంకు తెలిపింది. దుండగులు కస్టమర్లకు క్యూఆర్ కోడ్‌లు పంపుతూ వాటిని స్కాన్ చేసి పిన్ ఎంటర్ చేయాలని కోరుతున్నారని, దీంతో వినియోగదారులు అలాగే చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారని ఎస్‌బీఐ తెలిపింది. కనుక ఈ బ్యాంకు కస్టమర్లు క్యూఆర్ కోడ్ స్కామ్‌ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఇక పంజాబ్ నేషనల్ బ్యాంకు కస్టమర్లకు ఫేక్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు వస్తున్నాయని, వాటిని నమ్మి మోసపోవద్దని ఆ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. బ్యాంకు నుంచి ఎవరూ ఫోన్ చేయరని, అలాంటి కాల్స్, ఎస్ఎంఎస్‌లు వస్తే నమ్మవద్దని కోరింది.
ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు తమ వివరాలను ఇతరులతో షేర్ చేసుకోరాదని సూచనలు చేసింది. బ్యాంక్ ఉద్యోగులమంటూ కొందరు ఫోన్ చేసి కస్టమర్ల వివరాలను సేకరించి మోసాలకు పాల్పడుతున్నారని, కనుక ఎవరైనా అలా సమాచారం అడిగితే చెప్పవద్దని ఆ బ్యాంకు కోరింది.