ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. వాట్సాప్ ప్రవేశపెట్టిన కొత్త పాలసీని అనుమతించకపోతే మే 15వ తేదీ తరువాత యూజర్లు వాట్సాప్‌ను వాడుకోలేరని గతంలో వాట్సాప్ తెలియజేసిన సంగతి విదితమే. అయితే ఆ పాలసీ అమలును ఉపసంహరించుకున్నట్లు వాట్సాప్ తెలిపింది. ఈ మేరకు వాట్సాప్ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.
వాట్సాప్ యూజర్లు కొత్త పాలసీకి తమ అంగీకారం తెలపాల్సి ఉంటుందని, లేదంటే ఫిబ్రవరి 8వ తేదీ తరువాత యూజర్ల అకౌంట్లు డిలీట్ అవుతాయని, వారు వాట్సాప్‌ను వాడుకోలేరని గతంలో వాట్సాప్ ప్రకటించింది. అయితే యూజర్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వాట్సాప్ వెనక్కి తగ్గింది. ఈ క్రమంలో చాలా మంది యూజర్లు టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌లకు మారారు.
అయితే తరువాత వాట్సాప్ కొత్త పాలసీకి అనుమతి తెలిపేందుకు యూజర్లకు మే 15వ తేదీ వరకు గడువిచ్చింది. కానీ ఇప్పుడు కూడా యూజర్ల నుంచి పెద్ద ఎత్తున మళ్లీ విమర్శలు రావడంతో వాట్సాప్ దెబ్బకు వెనక్కి తగ్గింది. పాలసీని అమలుచేయబోవడం లేదని, అందువల్ల యూజర్లు ఈ విషయంలో కంగారు పడాల్సిన పనిలేదని, వారి అకౌంట్లకు ఏమీ కాదని వాట్సాప్ తెలిపింది. అయితే భవిష్యత్తులో మళ్లీ పాలసీ అమలు నిర్ణయం తీసుకుంటుందా, లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.