ఎలా అయినా వీలయినంత త్వరగా ఎన్నికలు జరపాలని చూస్తున్న కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని రేపు ఉదయం పది గంటలకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల మీద ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అంతకు ముందు కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ నీలం సాహ్నీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరిషత్ ఎన్నికల నిర్వహణపై సమీక్ష జరిపారు. పరిషత్ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కలెక్టర్లు, ఎస్పీల అభిప్రాయాలు నీలం సాహ్నీ తీసుకున్నారు.
ఎస్ఈసీ తో పాటు వీడియో కాన్ఫరెన్స్ లో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, వైద్యారోగ్య, పోలీసు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, టీకా పంపిణీ కార్యక్రమంపై ఎస్ఈసీ నీలం సాహ్నికి వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు అనిల్ కుమార్ సింఘాల్, కాటంనేని భాస్కర్ వివరాలు అందించారు. వీలైనంత త్వరగా ఎన్నికల ప్రక్రియ ముగిస్తే వ్యాక్సినేషన్ సహా కోవిడ్ నివారణ చర్యలపై ఫోకస్ పెడతామని వైద్యారోగ్య శాఖ పేర్కొంది. ఎన్నికల నిర్వహణలో పూర్తి స్థాయిలో కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తామని వైద్యారోగ్య శాఖ పేర్కొంది.