తెలంగాణ ప్రజలకు మరో శుభవార్త. ఇప్పటికే రాష్ట్రం నుంచి రెండు వందేభారత్ రైళ్లు పరిగెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో మరొకటి చేరబోతోంది. రాష్ట్రం నుంచి త్వరలో మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలు ఎక్కించేందుకు కసరత్తు జరుగుతోంది. సికింద్రాబాద్ నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరు వరకు ఈ రైలును అందుబాటులోకి తెచ్చే అవకాశాలున్నాయి.
సికింద్రాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు రెండు రూట్లున్నాయి. వికారాబాద్, తాండూరు, రాయచూరు, గుంతకల్లు మీదుగా ఒకటి కాగా మహబూబ్‌నగర్, కర్నూలు, గుంతకల్లు మీదుగా మరో మార్గం ఉంది. రెండో మార్గం వైపే రైల్వే శాఖ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. రాష్ట్రం నుంచి రెండో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్-బెంగళూరు మధ్య ప్రవేశపెట్టాలని తొలుత అనుకున్నారు.
అయితే తెలంగాణ ప్రజలు తిరుమలకు నిత్యం పెద్దసంఖ్యలో వెళుతుంటారని, ముందు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఎక్స్‌ప్రెస్ ప్రారంభించాలని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పట్టుబట్టడంతో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అంగీకరించారు. ఈ రైలును ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించారు. సికింద్రాబాద్-బెంగళూరు వందేభారత్‌ను కొంత కాలం తర్వాత ప్రవేశపెట్టాలని రైల్వేశాఖ భావించింది. కానీ కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వీలైనంత తొందరగా దీనిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.