ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. హుబ్బళ్లిలో రోడ్‌షోలో ఓ యువకుడు భద్రతా వలయాన్ని ఛేదించుకుని.. ఒక్కసారిగా ప్రధాని మోదీకి అత్యంత సమీపానికి దూసుకురావడం కలకలం రేపింది. గురువారం సాయంత్రం జాతీయ యువజనోత్సవాలను ప్రారంభించేందుకు హుబ్బళ్లికి చేరుకున్న ప్రధాని.. స్థానిక విమానాశ్రయం నుంచి వేడుక జరిగే రైల్వే స్పోర్ట్స్ గ్రౌండ్ వరకు రోడ్‌షో నిర్వహించారు. ఇందులో భాగంగా వాహనం ఫుట్‌బోర్డుపై నిలబడి రోడ్డుకు ఇరువైపులా ఉన్న జనాలకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు.
ఈ క్రమంలోనే.. ఓ వ్యక్తి బారికేడ్ దాటి ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చాడు. అలాగే ప్రధాని మోదీ వాహనం వైపు దూసుకెళ్లాడు. ప్రధానికి పూలమాల వేసేందుకు యత్నించాడు. దీంతో అప్రమత్తమైన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) చివరి క్షణంలో అతన్ని అడ్డుకుంది. స్థానిక పోలీసులు వెంటనే అతన్ని దూరం తీసుకెళ్లారు. అనంతరం ప్రధాని యథావిధిగా రోడ్డు షో కొనసాగించారు.