అధ్యక్ష ఎన్నికల్లో విజయానికి చేరువైన బైడెన్‌కు అమెరికా సీక్రెట్ సర్వీస్ భద్రత పెంచింది. ఆయన సొంత రాష్ట్రమైన డెలావర్‌కు అదనంగా ఏజెంట్లను పంపించింది. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందే వారికి అమెరికా సీక్రెట్ సర్వీస్ భారీగా భద్రత కల్పిస్తుంది. కాబోయే అధ్యక్షుడికి విమాన ప్రయాణాల సమయాల్లో కూడా ఈ విభాగం అదనపు రక్షణ చర్యలు తీసుకుంటుంది. గత వారం నుంచే బైడెన్ వెంట సీక్రెట్ సర్వీస్ బృందం ఒకటి రక్షణగా ఉంటున్నట్లు అమెరికా మీడియా అంటోంది.
వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమిని అంగీకరించడానికి సుముఖత చూపడం లేదు. తన సహాయకులు, సలహాదార్లు, పార్టీ నేతలతో సమావేశమై ఆయన అన్ని అంశాలనూ చర్చించారు. ఓటమిని ఒప్పేసుకోవడం మంచిదని, హుందాగా ఉంటుందని కొందరు సూచించగా మిగిలిన వారు కోర్టుల్లో గట్టిగా పోరాడదామని అభిప్రాయపడ్డారు.ఎన్నికల్లో గెలుపును డెమొక్రాట్లు తన నుంచి లాగేసుకుంటున్నారంటూ డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను తోటి రిపబ్లికన్లే తిరస్కరిస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై విమర్శలు చేస్తూ ట్వీట్లు, పోస్టులు పెడుతున్నారు.