ఒక దేశ సంస్కృతిని ఒక ప్రాంతం సంబంధిత భాషను ఇంకా నడవడిని గౌరవించకుంటే మనకు రోజుల్లేవు అని అంటారు పెద్దలు. అవును! మనం ఏం చేసినా చేయకున్నా భాషకు ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇవ్వకుంటే అది మనుగడలో ఉండనివ్వకుండా చేస్తే అప్పుడు మనకు గౌరవం అన్నదే దక్కకుండా పోతుంది. అయినా భాషను నెత్తిమీద పెట్టుకుని పూజించడం అన్నది మనకు చేతగాని పని అని ఎన్నోసార్లు తేలిపోయింది కూడా! అయినా కూడా ఏదో చిన్న ఆశ. ఎక్కడో ఆవగింజంత! ఇంగ్లీషు భాష ప్రేమలో ఉండే మనం తెలుగుకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఎందుకనో ఇవ్వం..కేవలం అదొక అవసరం కావొచ్చు.. ఇంగ్లీషు నేర్చడం అవసరం..తెలుగును కాపాడుకోవడం హక్కు మరియు బాధ్యత కూడా! కానీ ఇవేవీ చెయ్యకుండానే మనం కాలం నెట్టుకువస్తున్నాం. అదే మన దౌర్భాగ్యానికి సంకేతం కూడా!
గౌరవ పురస్కారాలు గౌరవ తిరస్కారాలు అని రెండుంటాయి.భాషకు సంబంధించి వాడుక బాగుంటే అది గౌరవ పురస్కారం లేకుంటే అది గౌరవ తిరస్కారం.ఎన్హెచ్ఏఐ ఏర్పాటు చేసిన బోర్డు చూడండి ఎంత బాగుందో..ఎంత అర్థవంతంగా ఉందో! విని చూసి నవ్వుకోండి. పండగ పూట నవ్వులకు ఈ పాటి నవ్వలు జత చేయండి.
ఏం కాదు మన దేశంలో భాషకు ఇచ్చే గౌరవం కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటే కొన్ని చోట్ల అస్సలు ఏమీ లేని విధంగా ఉంటుంది అనేందుకు తార్కాణమే ఈ బోర్డు. సంచివాలయం అని రాశారు. ఘోరం కదూ! సచివాలయం అనే పదానికి వచ్చిన కష్టం ఇది! ఇంతటి శ్రద్ధ ఉన్న మన గౌరవ యంత్రాగాన్ని తిట్టుకోకండి. ఆ మాటకు వస్తే ఏమీ అనకండి కూడా! ప్లీజ్ నా మాట వినండి బాస్! ఇంగ్లీషులో పదాలు రాసేటప్పుడు ఏ ఇబ్బందీ ఉండదు కానీ తెలుగులో రాసేటప్పుడు ఎక్కడ లేని తెగులు రాసేవాడికి వచ్చేస్తుంది అదేంటో! పోనీ రాశాక దిద్దుతారా అదీ ఉండదు. ఇదే ఏ తమిళనాడులోనో మరో రాష్ట్రంలోనో చూడండి.. తంతారు ఇలా చేస్తే కానీ ఇక్కడ అస్సలు పట్టింపే ఉండదు.
మన ప్రభుత్వాలు అవి వాడే భాష ఇవన్నీ కాస్త వికృతంగా ఉన్నా విరుద్ధంగా ఉన్నా విని నవ్వుకుని తప్పుకునిపోవాలి.లేదంటే మనకూ మన ప్రభుత్వాలకూ మధ్య గ్యాప్ వచ్చేస్తుంది.ఆ విధంగా మనం భాషను గౌరవించన వాళ్లను, మాతృభాష అంటే అస్సలు సంబంధం లేనివిధంగా ఉండేవారిని చూసి నవ్వుకుని తీరాలి.ఈ విధంగా చేస్తే మంచి ఈ విధంగా చేయకపోతే చెడు.సచివాలయం పేరు చూడండి ఈ బోర్డులో ఎంత బాగా రాశారో! విని ఓ నవ్వు నవ్వి వెళ్లండి.. అంతకుమించి మనమేం చేయలేం.