హైదరాబాద్లో అక్రమ బంగారం రవాణా యథేచ్చగా సాగుతోంది. ఇటీవల కాలంలో అక్రమ బంగారం పెద్ద ఎత్తున పట్టుబడుతున్నా అక్రమార్కులు మాత్రం ఎక్కడా రాజీపడటం లేదు. దొంగ మార్గాన బంగారాన్ని గుట్టుగా తరలిస్తున్నారు. స్మగ్లింగ్ ముఠాలు ఇలా అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అక్రమంగా బంగారాన్ని తరలించే ముఠాలపై నగర పోలీసులు ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ ఓఆర్ఆర్ ఏరియాలో 3.98 కిలోల బంగారాన్ని పట్టుకున్నట్లు రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. పట్టుబడిన బంగారం విలువ రూ.2.94 కోట్లు ఉంటుందని తెలిపారు. విదేశానికి చెందిన ఈ బంగారాన్ని బెంగాల్‌లోని కోల్‌కతా నుంచి తీసుకొస్తుండగా.. హైదరాబాద్లో పట్టుకున్నామన్నారు. కారు సీటు వెనుక బ్రౌన్ టేపు వేసి బంగారం దాచినట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు.