నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏకపక్షం, అహంకారంతో తీసుకుంటున్న నిర్ణయాలపై బీజేపీ సీనియర్ నాయకులు మండిపడుతున్నారు. జగిత్యాల పట్టణంలో బుధవారం అరవింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎంపీ అరవింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ…. బీజేపీని ఎన్నో సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఎంపీ అందుబాటులో ఉండడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
వ్యతిరేకంగా మాట్లాడితే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారని, పరోక్షంగా పోలీసు కేసులను పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర పార్టీలకి అమ్ముడుపోయే వ్యక్తులకు టికెట్లు ఇచ్చి పార్టీని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు ఇస్తే కూలీల మాదిరి కార్యకర్తలు వస్తారని అనడం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు.రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అరవింద్‌కు తప్ప పార్టీలోని ఇతర సీనియర్ నాయకులకు టికెట్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో లింగాల శ్రీకాంత్ రావు, బావేటి శ్రీనివాస్,చీటీ శేఖర్ రావు, విద్య సింగ్, ఎడమల వెంకట్ రజం, గోగికర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.