ఈ మధ్య కాలంలో ర్యాగింగ్ భూతం పేట్రేగిపోతోంది. సీనియర్లన్న అహంకారంతో కొందరు విద్యార్థులు అరాచకాలకు పాల్పడుతున్నారు. జూనియర్లను బానిసలుగా భావిస్తూ వారితో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. చెప్పినట్టు వినకపోతే ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. ఇలాంటి ఘటనే దిల్లీలో చోటుచేసుకుంది.
సార్ అని పిలవలేదన్న కోపంతో ఓ జూనియర్ విద్యార్థిని కొంత మంది సీనియర్లు చితకబాదారు. ఈ ఘటలో ఆ జూనియర్ విద్యార్థి భుజంలోని ఎముక విరిగిపోయింది. బాధితుడి కుటుంబం, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. నోయిడాలోని జేఎస్‌ఎస్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి డిసెంబర్ 7న రాత్రి తన హాస్టల్‌లో చదువుతున్నాడు. అతడి రూమ్‌మేట్‌కు కాల్ చేసిన సీనియర్ విద్యార్థులు.. జూనియర్‌ను తమ రూమ్‌కు పంపమని చెప్పారు. ఈ క్రమంలోనే రూమ్‌కు వెళ్లిన జూనియర్‌ను వాళ్ల అసైన్‌మెంట్ పూర్తి చేయమని అడిగారు. అప్పటికే సీనియర్లు రూమ్‌లో మద్యం తాగుతూ ఉన్నారని జూనియర్ విద్యార్థి చెప్పాడు. అసైన్‌మెంట్ చేయడానికి జూనియర్ విద్యార్థి నిరాకరించాడు. దీంతో కోపం తెచ్చుకున్న సీనియర్ విద్యార్థులు మద్యం మత్తులో అతడితో అసభ్యకరంగా మాట్లాడుతూ దాడికి దిగారు. సార్ అని పిలవాలని జూనియర్ విద్యార్థిని బెదిరించారు.
కాలేజీ రిజిస్ట్రార్ తన తండ్రి స్నేహితుడంటూ మరో సీనియర్ బెదిరించాడు. అనంతరం భయపడ్డ జూనియర్ తర్వాత తన గదికి వెళ్లిపోయాడు. కాసేపటికి జరిగిన విషయంపై సెక్యూరిటీ గార్డుకు ఫిర్యాదు చేశాడు. కోపోద్రిక్తులైన సీనియర్ విద్యార్థులు తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో జూనియర్‌ను మళ్లీ తమ రూమ్‌కు రావాలని ఫోన్ చేశారు. బాధితుడు రాను అని తెలిపాడు. కాసేపటికి సీనియర్ విద్యార్థులే జూనియర్ ఉండే రూమ్‌కు వచ్చి లోపలి నుంచి తలుపుకు తాళం వేశారు. తమ గదికి పిలిస్తే ఎందుకు రాలేదని జూనియర్‌ను సీనియర్లు ప్రశ్నించారు.
అనంతరం హాస్టల్‌లోని కారిడార్‌లో వార్డెన్, కళాశాల అధికారి ఎదుటే జూనియర్ విద్యార్థిని సీనియర్ విద్యార్థులు మళ్లీ కొట్టారు. ఒకరు జూనియర్ విద్యార్థి చేతులు పట్టుకోగా, మరొకరు అతని మెడను నొక్కి పట్టుకున్నాడు. మరో సీనియర్ విద్యార్థి బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లేంత వరకు కొడుతూ ఉన్నాడు. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు జోక్యం చేసుకుని సీనియర్ విద్యార్థులను వాళ్ల గదిలోకి పంపించాడు
ఈ ఘటన జరిగిన మరుసటి రోజు గాయపడిన విద్యార్థి తన కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశాడు. బంధువులు అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు బాధితుడికి ఎక్స్-రే తీయగా పరీక్షలో భుజం ఎముక విరిగిందని తేలింది. విద్యార్థిపై దాడి కేవలం దాడి మాత్రమే కాదని ర్యాగింగ్ నిషేధ చట్టం కింద కేసు నమోదు చేయాలని బాధితుడి తరఫు బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదై ఐదు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
నిందితులైన విద్యార్థులను అరెస్టు చేసేందుకు పోలీసు శాఖ ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసినట్లు నోయిడా డీసీపీ హరీశ్ చందర్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులందరినీ త్వరలోనే పట్టుకుంటామని నేరం రుజువైతే నలుగురు విద్యార్థులపై దాడి నుంచి హత్యాయత్నం వరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.