తెలంగాణ గవర్నర్ గా తమిళిసై సౌందర్ రాజన్ మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా రాజభవన్ లో గవర్నర్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ఆఫీస్ పై తీవ్రమైన వివక్ష చూపుతున్నారని అన్నారు. తనకి ఎవరిపై వ్యక్తిగత ద్వేషం లేదని, తనకి గౌరవం ఇవ్వకపోతే.. తానేమీ తక్కువ కాదని అన్నారు. గవర్నర్ గా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ పాటించడం లేదని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా నా పని నేను కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన మూడేళ్లలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని తమిళిసై ఆరోపించారు. మేడారం సమ్మక్క – సారక్క పర్యటనలో తనను అవమానించారని విమర్శించారు. హెలికాప్టర్ అడిగినా ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. దాంతో ఎనిమిది గంటలు రోడ్డు ప్రయాణం చేయాల్సి వచ్చింది అన్నారు.గిరిజన, యూనివర్సిటీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశానని చెప్పారు. ఈ మూడేళ్లలో రాజభవన్ ను ప్రజాభవన్ గా మార్చామని తెలిపారు.