వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మత్తు మందు ఇస్తుండగా కార్డియాక్ అరెస్టుతో చనిపోయిన ఎనిమిదేళ్ల బాలుడి ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు విచారణకు ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో అలెర్ట్ అయిన వరంగల్ అడిషనల్ కలెక్టర్ శ్రీవాస్తవ.. రంగంలోకి దిగి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు.
వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలుడు మరణించాడని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సీనియర్లు లేకుండా జూనియర్ డాక్టర్లు మోతాదుకు మించిన ఇంజిక్షన్ ఇవ్వడం వల్లే బాలుడికి కార్డియాక్ అరెస్ట్ అయి మృతి చెందాడని అనుమానిస్తున్నారు. బాలుడి పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత అసలు విషయం ఏంటో తెలుస్తుందని అన్నారు. ఆ తర్వాతే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
చేయి విరిగి ఆస్పత్రికి వస్తే ప్రాణాలు పోయిన ఈ ఘటనతో సర్కార్ దవాఖానాల్లో వైద్యంపై ప్రజలకు నమ్మకం కోల్పోయేలా చేస్తోందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బాధ్యులెవరో తెలుసుకుని వీలైనంత త్వరలో వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.