ఆ 400 ఎకరాల ప్రభుత్వ భూమి ఎక్కడ..సిట్ నివేదికలో సంచలన విషయాలు

-

విశాఖలో సంచలనం సృష్టించిన భూ అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ముగిసింది. 450పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసేందుకు రంగం సిద్ధమైంది. సుమారు 400ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యాయని భావిస్తుండగా…. వీటి విలువ వందల కోట్లుగా నిర్ధారించారు. అడ్డగోలుగా ఎన్.వో.సీలు జారీ, రికార్డుల తారుమారు చేసిన సూత్రధారులు, పాత్రధారులపై క్రిమినల్ చర్యలకు సిట్ సిఫార్సు చేయనుందని సమాచారం. దీంతో ల్యాండ్ స్కాం బాధ్యుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

వేల కోట్ల రూపాయల విలువైన విశాఖ భూకుంభకోణంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రూపొందించిన నివేదిక ఉత్కంఠను రేకెత్తిస్తోంది. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ విజయ్ కుమార్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల బృందం ఏడాదికిపైగా విచారణ నిర్వహించింది. మొదట్లో విశాఖ రెవెన్యూ డివిజన్ పరిధిలో అక్రమాలపైనే ఫోకస్ పెట్టాలని భావించినప్పటికీ… జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చాయి.

450 పేజీలతో కూడిన సవివర నివేదికను సిట్ కొద్దిరోజుల్లోనే ముఖ్యమంత్రికి అందజేయనుంది. సుమారు 400ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయినట్టు సిట్ గుర్తించింది. 30 NOCల జారీకి సంబంధించి నిబంధనలు పాటించలేదని నిర్ధారించింది. దీంతో సిట్ నివేదికలో ఎవరెవరి పేర్లు వున్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే, 22ఏకు సంబంధించిన ఫిర్యాదులు సిట్ దగ్గరకు అధికంగా వచ్చాయి. దీనిపైన కొన్ని సూచనలను చేసినట్టు తెలిసింది. ఫైనల్ రిపోర్ట్‌కు తుదిమెరుగులు దిద్దుతున్న సిట్ చీఫ్ విజయ్ కుమార్ త్వరలోనే నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని వెల్లడించారు.

గత ప్రభుత్వ హయాంలో వెలుగుచూసిన విశాఖ భూకుంభకోణం రాజకీయాలను కుదిపేసింది. వందల కోట్ల రూపాయల ఈ స్కాంలో అనేక మంది ప్రముఖుల పేర్లు వినిపించాయి. దీంతో టీడీపీ సర్కార్ సిట్ వేసి విచారణ జరిపించినప్పటికీ నివేదిక వెలుగు చూడలేదు. అప్పటి సిట్ పై తమకు నమ్మకం లేదని ప్రతిపక్షంలో వున్న వైసీపీ ప్రకటించడమే కాదు తాము అధికారంలోకి వస్తే దర్యాప్తు చేసి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించింది. ఇందుకు అనుగుణంగానే సిట్ 2019 ఏర్పాటు చేయగా… గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన సిట్ ఇచ్చిన నివేదికను, రికార్డులను ప్రస్తుత సిట్ బృందం పరిశీలించింది.

22ఏ జాబితాలో నమోదైన భూములకు సంబంధించి కీలకమైన రికమండేషన్లను సిట్ రూపొందించినట్టు తెలిసింది. ఇక, మధురవాడ, పరవాడ, భీమునిపట్నం, విశాఖ గ్రామీణ మండలాల పరిధిలో జారీ చేసిన ఎన్ఓసీల్లో అధికంగా ఆక్రమాలు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో బాధ్యులపై సిట్ ఏమని రికమండ్ చేస్తుంది.. దీనికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news