రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి తమకు నిధులు అందడం లేదని ఎప్పటి నుంచో ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తున్నారు. కొందరు ఆదిలో అసెంబ్లీలోనే ఈ విషయాలను వెలుగులోకి తెచ్చారు. అయితే తర్వాత నిధుల విషయాన్ని ఎట్టి పరిస్థితిలోనూ సభలో చర్చకు రానీయవద్దని.. చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సీరియస్‌గానే ఎమ్మెల్యేలకు చెప్పారు. దీంతో ఇప్పుడుఎమ్మెల్యేలు.. అసెంబ్లీ ఉన్నా లేకున్నా.. సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. తమ నియోజకవర్గాల్లో పనులు ఆగిపోయాయని.. నిధులు ఇవ్వాలని కోరుతున్నారు.
మరీ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉండడం.. చాలా ప్రాజెక్టులు ఆగిపోవడం.. వంటివి ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారింది. సీఎం జగన్ పూర్తిగా సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడంతో అభివృద్ధి పనులకు నిధులు లేక ఎమ్మెల్యేలు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక విలవిల్లాడుతున్నారు. ఇక మొన్నటి వరకు చాలా మంది ఎమ్మెల్యేలకు జగన్ అపాయింట్‌మెంట్ కూడా దక్కని పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. గతంలో టీడీపీ హయాంలో అనేక ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ఎన్నికలకు ముందు చాలా వరకు శంకుస్థాపనలు కూడా జరిగాయి.
అప్పటి చంద్రబాబు వ్యూహం మేరకు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆయన ఇలా చేసి వదిలేశారు. అయితే.. ఇప్పుడు వీటిని పూర్తి చేయడం వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రధాన ప్రాధాన్యంగా మారింది. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు.. ఈ శంకుస్థాపన అంశాలను ప్రధానంగా చర్చించుకుంటున్నారు. ప్రజల్లో ప్రచారం కూడా చేస్తున్నారు. “మేం శంకు స్థాపనలు చేసిన ప్రాజెక్టులను కూడా వైసీపీ ఎమ్మెల్యేలు పూర్తి చేయలేక పోతున్నారని, ఏడాది అయినా.. వాటికి మోక్షం లేదని వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
దీంతో వారు.. తమకు నిధులు ఇవ్వాలంటూ. మంత్రుల ముందు గగ్గోలు పెడుతున్నారు. ఇక మంత్రుల శాఖలకు నిధుల కోత పెడుతుండడంతో వారు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. మరోవైపు కొందరికే నిధులు ఇవ్వడం .. మరికొందరికి ఇవ్వకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిపైనా మంత్రులను ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారు. మొత్తానికి ఇలా అయితే.. ఎలా సార్.. అనే అసంతృప్తి వైసీపీ ఎమ్మెల్యేల్లో పెరుగుతుండడం గమనార్హం. ఇక అటు జగన్ దగ్గర కూడా తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించే ధైర్యం ఎమ్మెల్యేలకు లేకపోవడంతో వీరిలో వీరే అసంతృప్తితో రగులుతోన్న పరిస్థితే ఉంది.