ఆసియా కప్ కు ముందు పాక్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పెసర్ షహీన్ షా ఆఫ్రిది గాయం కారణంగా ఆసియా కప్ కు దూరమయ్యాడు. ప్రస్తుతం షహీన్ షా ఆఫ్రిది మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. ఈ ఏడాది జులైలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఫీల్డింగ్ చేస్తుండగా ఆఫ్రిది గాయపడ్డాడు.
దీంతో అతడు శ్రీలంకతో ఆఖరి టెస్ట్ తో పాటు నెదర్లాండ్స్ తో జరిగిన వన్డే సిరీస్ కు కూడా దూరమయ్యాడు. కాగా ప్రస్తుతం అతడు తన గాయం తీవ్రత దృష్ట్యా నాలుగు నుంచి ఆరు వారాల విశ్రాంతి తీసుకోవాలని పిసిబి మెడికల్ అడ్వైజరీ కమిటీ సూచించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో అతడు ఆసియా కప్ తో పాటు వచ్చేనెల స్వదేశంలో జరగనున్న ఇంగ్లాండ్ సిరీస్ కు కూడా దూరం కానున్నాడు. ఇక అతడు తిరిగి మళ్లీ న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తో ట్రై సిరీస్ కు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా ఆసియా కప్ 2022 ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్ లో ఆగస్టు 28న దుబాయ్ వేదికగా భారత్ తో తలపడనుంది.