లైంగిక వేధింపుల బాధితురాలి అపహరణలో ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీదే కీలక పాత్ర అని కర్ణాటక హైకోర్టుకు సిట్ తెలిపింది. ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు బాధితులను మేనేజ్ చేయాలనుకుందని పేర్కొంది. విచారణను ఆమె తప్పుదోవ పట్టిస్తున్నారని.. ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని కోరింది. అయితే ఆమె పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని భవానీ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. దీంతో ఆమెకు ధర్మాసనం ముందస్తు బెయిల్ ఇచ్చింది.
పలువురు మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ(ఎస్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జ్యుడీషియల్ కస్టడీని బెంగళూరు కోర్టు మంగళవారం మరో 14 రోజుల పాటు పొడిగించింది. 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు అతని కస్టడీని పొడిగించింది. ఆ తర్వాత కర్ణాటక పోలీసులు సిట్ అతన్ని పరప్పన అగ్రహార జైలుకు తరలించనుంది. 33 ఏళ్ల మాజీ జేడీ(ఎస్) ఎంపీని మే 31న జర్మనీ నుంచి బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కర్ణాటక పోలీసుల బృందం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.