టీటీడీపీ అధ్యక్షుడిగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే !

తెలంగాణ తెలుగు దేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులును నియమిస్తారని సమాచారం అందుతోంది. ఇవాళ సాయంత్రం లేదా సోమవారం బక్కని నరసింహులును తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించనున్నారని తెలుస్తోంది.

పార్టీ అధ్యక్షుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లను చంద్రబాబు నాయుడు నియామకం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతో సీనియర్ నేత రావుల చంద్రశేఖర రెడ్డి టీటీడీపీ అధ్యక్షుడి పదవిని స్వీకరించడానికి నిరాకరించారని తెలుస్తోంది.

దీంతో షాద్‌ నగర్‌ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం అందుతోంది. కాగా.. ఇటీవలె… తెలుగు దేశం తెలంగాణ అధ్యక్ష పదవి మరియు టీడీపీ పార్టీకి ఎల్‌. రమణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. టీడీపీకి రాజీనామా చేసిన ఆయన… నేరుగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ మేరకు నిన్న సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు ఎల్‌. రమణ.