శక్తిమిల్ గ్యాంగ్ రేప్ కేసులో బాంబే హైకోర్ట్ సంచలన తీర్పు

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన శక్తి మిల్ అత్యచార కేసులో బాంబే హైకోర్ట్ సంచలన తీర్పు చెప్పింది. ముగ్గురు దోషుల‌కు కిందికోర్టు విధించిన మ‌ర‌ణ శిక్ష‌ను బాంబే హైకోర్టు గురువారం యావజ్జీవ శిక్షగా మార్చింది. నిందితులు త‌మ మిగిలిన జీవిత‌మంతా జైలులో గ‌డ‌పాల‌ని, దోషులు సమాజంలో కలిసిపోవడానికి అనుమతించబడరని, సంస్కరణకు అవకాశం లేనందున వారు పెరోల్‌పై విడుదలకు అర్హులు కాదని పేర్కొంది. జస్టిస్ సాధన జాదవ్ మరియు పృథ్వీరాజ్ చవాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెల్లడించింది. ’’అత్యాచారం బాధితురాలు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా బాధపడుతుంది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన. కానీ ప్రజల ఆగ్రహాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోలేము. తీర్పు ప్రజల ఆగ్రహాన్ని లేదా ప్రజాభిప్రాయంతో మార్గనిర్దేశం చేయరాదు” అని కోర్టు పేర్కొంది.

అసలేంటీ ఈ కేసు:

2013న 22 ఏళ్ల ఫోటో జర్నలిస్ట్‌పై సామూహిక అత్యాచారం చేసిన ఘటన దేశంలో సంచలనం కలిగించింది. ఫోటో షూట్ కోసం ఓ వ్య‌క్తితో క‌లిసి వెళ్లిన 22 ఏండ్ల ఫోటో జ‌ర్న‌లిస్ట్‌పై నిందితులు జాదవ్, ఖాసిం షేక్, అన్సారీలు సామూహిక లైంగిక దాడి చేశారు. ఈ ఘటనలో మరో ఇద్దరు కూడా నిందితులుగా ఉన్నారు. అయితే ఇందులో ఒకరు మైనర్. ఈ అత్యాచారం చేయడానికి నెలల ముందు అదే స్థలంలో 19 ఏళ్ల టెలిఫోన్ ఆపరేటర్‌పై సామూహిక అత్యాచారం చేశారు.