వరుస పరాజయాల తర్వాత శ్రీకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు శర్వానంద్. ఇప్పటికే ఈ సినిమా టీజర్, టైటిల్ సాంగ్ రిలీజ్ అయ్యాయి. వాటికి ప్రేక్షకుల నుండి మంచి స్పందనే వచ్చింది. రాయలసీమ యాసలో సాగే భలేంగుంది బాలా పాట జనాల్లోకి బాగా వెళ్ళింది కూడా. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని వదిలింది చిత్ర బృందం. సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే శర్వానంద్ కి అమెరికాలో మేనేజర్ గా ఆఫర్ వస్తుంది. ఐతే అది వద్దని వ్యవసాయం చేద్దామని తన ఊరికి వస్తాడు శర్వా.
అక్కడ తనకెదురయ్యే పరిస్థితులు, ఊళ్ళో భూముల కోసం జరిగే పంచాయితీల మధ్య శర్వానంద్ నాన్న రావు రమేష్ నలిగిపోతుంటాడు. వాటన్నింటినీ కాదనుకుని వ్యవసాయం చేసి ఏ విధంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తాడనేదే కథ. ఇక్కడ ముఖ్యంగా చర్చించుకోవాల్సిన పాయింట్ ఏదైనా ఉందంటే, అది ఉమ్మడి వ్యవసాయం. పొలాలని బీడులుగా ఉంచకుండా ఉమ్మడిగా వ్యవసాయం చేసి సేద్యం గెలుద్దామన్న శర్వానంద్ మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. 14రీల్స్ ప్లస్ బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా, కిషోర్ బి దర్శకత్వం వహించారు.