శశికళ నిర్ణయంతో తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం మారనుందా ?

-

శశికళ ప్రకటన అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే కూటమికి బూస్ట్‌ తీసుకొస్తే.. ఈ ఎన్నికల్లో అధికారం గ్యారంటీ అనే ధీమాగా ఉన్న ప్రతిపక్ష డీఎంకేకు మాత్రం ఊహించని షాక్‌ తగిలినట్లైంది. ఇన్నాళ్లు అన్నాడీఎంకే విభేదాలు తమకు కలిసొస్తాయని డీఎంకే భావించింది. జైలు నుండి బయటకు వచ్చిన శశికళ దినకనర్‌తో కలసి వెళుతుందని… దీనివల్ల ఓట్లు చీలి తమకు గెలుపు గ్యారంటీ అనుకున్న స్టాలిన్‌కు.. శశికళ రాజకీయ సన్యాసం మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా చేసింది.

గత ఎన్నికల్లో అన్న అళగిరి కారణంగా అధికారం కోల్పోయిన డీఎంకే.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటుతామని భావించింది. రజనీకాంత్, శశికళ, కమల్ హాసన్, అన్నాడీఎంకేలాంటి నాలుగు కూటమిల వల్ల ఓట్లు పూర్తిగా డైవర్ట్‌ అవుతాయని.. మన ఓటు బ్యాంకు మాత్రం ఎక్కడికి పోదని ఇన్నాళ్లు సంతోషంగా ఉన్నారు డీఎంకే నేతలు. అయితే రజనీకాంత్‌ రూపంలో స్టాలిన్‌కు తొలి దెబ్బ తగలగా.. ఇప్పుడు శశికళ రూపంలో రెండో దెబ్బ తగిలింది. శశికళ రాజకీయాల నుంచి తప్పుకోవడంతో అన్నాడీఎంకే కూటమి మరింత బలంగా మారిందంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.

మరోవైపు అన్న అళగిరి కూడా డీఎంకే ఓటమే లక్ష్యంగా పని చేయడం ఆ పార్టీకి మరింత మైనస్‌గా మారింది. ఇలా తమిళనాడు రాజకీయాలు అధికారమే లక్ష్యంగా ట్విస్ట్‌లా మీద ట్విస్ట్‌లతో సాగిపోతూన్నాయి. నిన్న మొన్నటి వరకు తమిళనాడులో పార్టీల మధ్య బహుముఖ పోటీ తప్పదని అంతా భావించారు. ఇప్పటికే కమల్‌ హాసన్‌ పార్టీ స్థాపించి రాజకీయాల్లో దూకుడు పెంచారు. ఆ తరువాత రజనీకాంత్‌ కూడా రాజకీయ రంగ ప్రవేశానికి అంతా సిద్ధం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అతని సన్నిహితుల సూచనలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో రాజనీకాంత్ రాజకీయ ఎంట్రీకి ఫుల్‌ స్టాప్‌ పడింది. ఇప్పుడు శశికళ కూడా అదే బాటలో పయనించడంతో.. ఇతర పార్టీలకు వరంగా మారాయని చెప్పవచ్చు.

శశికళ లేనిదే జయలలిత లేదు. అమ్మ ప్రతి అడుగు వెనక ఈ చిన్నమ్మ ఉండేది. అంతలా తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు శశికళ. జయలలిత మరణానంతరం పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న శశికళ.. ముఖ్యమంత్రి పీఠం చేపడతారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా అక్రమాస్తుల కేసులో ఆమె జైలుకు వెళ్లడం. తనకు విశ్వాస పాత్రుడని నమ్మిన పళనిస్వామికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించడం అంతా కొన్ని రోజు వ్యవధిలోనే జరిగిపోయింది. కానీ ఆ తరువాత చిన్నమ్మపైనే తిరుగుబాటు చేశారు పళనిస్వామి. ఇప్పుడు సడెన్‌గా ఎన్నికల ముందు ఆమె రాజకీయ సన్యాసం చేయడం తమిళనాడు పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిగ్గా మారింది.

రాబోయే రోజుల్లో శశికళ ఏం చేయబోతోంది మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్‌ అవుతారా అన్న చర్చ నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news