ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. తాజాగా పార్టీ సీనియర్ నేత సిద్ధ రాఘవరావు టిడిపి గుడ్ బై చెప్పే అవకాశాలు కనబడుతున్నాయి. సిద్ధ రాఘవరావుకు ప్రకాశం జిల్లాలో మంచి పేరుంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో ఆయన మంత్రిగా కూడా పని చేయడమే కాకుండా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన నేత. 2004లో టీడీపీ తరఫున ఒంగోల్ అసెంబ్లీ కి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నియోజకవర్గం మారిపోయారు. 2009 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. 2014లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయనకు తొలి కేబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు.
చంద్రబాబు ఆ తరువాత కొన్ని కారణాలతో ఆయన్ను నియోజకవర్గం మారాలని కోరారు. 2019 ఎన్నికల్లో మళ్లీ దర్శి నుంచి పోటీ చేయాలని భావించిన ఆయన ఒంగోలు పార్లమెంట్ కేటాయించడంతో అక్కడి నుంచి పోటీ చేసి మాగుంట శ్రీనివాసుల రెడ్డి మీద ఓడిపోయారు. ప్రకాశం జిల్లా నుంచి ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు ,చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం అలాగే మాజీ మంత్రి పాలేటి రామారావు అదేవిధంగా పోతుల సునీత వంటి వారు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ తరుణంలోనే ప్రకాశం జిల్లాకు చెందిన మరో నేత కూడా పార్టీ మారడం టిడిపికి పెద్ద దెబ్బ అనే చెప్పాలి.