దుస్తులపై మరకలు పడితే వాటిని తొలగించాలంటే పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మనకు నచ్చిన దుస్తులపై మరకలు పడితే వాటిని ఎలాగైనా తొలగించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తాం. కానీ ఆ మరకలు అలాగే ఉంటాయి. అయితే కింద తెలిపిన పలు చిట్కాలు పాటిస్తే దుస్తులపై పడిన ఎలాంటి మరకలను అయినా చాలా తేలిగ్గా తొలగించవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. తెలుపు రంగు దుస్తులపై మరకలు పడితే ఆ దుస్తులను ఉతికే నీటిలో అరకప్పు వెనిగర్ కలపాలి. దీంతో మరకలు తొలగిపోవడమే కాదు, దుస్తులు కాంతివంతంగా మారుతాయి.
2. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో నిమ్మకాయ తొక్కలను వేసి బాగా మరిగించాలి. అనంతరం దుస్తులను నానబెట్టే నీటిలో ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని కలపాలి. ఆ తరువాత 1 గంట సేపు దుస్తులను నానబెట్టాక ఉతికి ఆరేయాలి. దీంతో దుస్తులపై ఉండే మరకలు పోతాయి.
3. దుస్తులపై పడ్డ మరకల మీద నిమ్మకాయ రసం పిండి ఉప్పు చల్లాలి. రాత్రంతా దుస్తులను అలాగే ఉంచాలి. తెల్లవారు జామున దుస్తులను చల్లని నీటితో పిండాలి. మరకలు పోతాయి.
4. దుస్తులపై పడ్డ మరకల మీద వోడ్కా రాయాలి. కొంత సేపు అయ్యాక దుస్తులను ఉతికేయాలి. మరకలు పోతాయి.
5. నాలుగు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా, నీరు కలిపి మిశ్రమంగా చేసి మరకలపై రాయాలి. కొంత సేపు ఆగాక దుస్తులను ఉతకాలి. దుస్తులపై ఉండే మరకలు పోయి, దుస్తులు మెరుస్తాయి.
6. అప్పుడే పడ్డ మరకలపై ఉప్పును చల్లాలి. తరువాత తేమ పోయాక క్లబ్ సోడాలో మరకలను ముంచాలి. 30 నిమిషాలు ఆగాక దుస్తులను ఉతికేయాలి. మరకలు పోయి, దుస్తులు కాంతివంతంగా మారుతాయి.