ఆయనో సినీ శాస్త్రజ్ఞుడు.. ప్రతి సినిమా ఊహాకందని అద్భుతం.. ప్రతి పాత్రా మిరాకిల్.. ఆయనను చూస్తే ఆ పాత్రల సృష్టికర్త ఈయనా? అంటూ ఆశ్చర్యపోవాల్సిందే. కథాగమనం, పాత్రల రూపకల్పన భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి.. వీటన్నింటిని సినీ తెరపై ఆవిష్కరించిన లెజండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. చిత్ర విచిత్రాలే కాదు.. సాంఘిక, పౌరాణిక పాత్రలతోనే గిమ్మిక్కులు చేశారాయన.. ఆ మహా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఆలీతో సరదాగా కార్యక్రమంలో సినీ విశేషాలు, తన అద్భుత ఆవిష్కరణల తీరుతెన్నులను పేర్కొన్నారు.
మీ వయస్సు అలాగే ఉండేందుకు అమృతం ఏమైనా తాగారా..?
సింగీతం శ్రీనివాసరావు : ఇదే విషయాన్ని చాలా మంది అడుగుతారు. 92వ ఏట అడుగుపెడుతున్నా. ఏమిటో ఈ బహుమతి. ఇప్పటికీ పాట రికార్డు చేసినా, మాట్లాడినా అలాగే ఉంటుంది. నడక మారలేదు. ఆలోచన ఇంకా షార్ఫ్‌గా ఉంది. నాకుగా నేను ప్రశ్నించుకుంటే.. మా నాన్నగారు నాకు ఇచ్చిన ఆస్తి సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఇదే నాకు బాగా అబ్బింది. అదే కారణం కావొచ్చు. మెంటల్‌గా నా వయస్సు ఇంకా 25 ఏళ్లే. ‘మాయాబజార్’లో చేరినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అదే స్థాయిలో పని చేయాలని ఉంటుంది.
‘మాయాబజార్’కు కో-డైరెక్టరా..? అసోసియేట్ డైరెక్టరా..?
సింగీతం శ్రీనివాసరావు : అప్రెంటీస్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా కేవీరెడ్డి తీసుకున్నారు. నాకో పరీక్ష పెట్టారు. ‘అలీవర్ గోల్ఫీ నాటకం అనువాదం చేయ్.. మూడు నెలల తర్వాత తీసుకుంటా’ అన్నారు. ఈ మూడునెలల్లో డైలాగులు, పాటలు, అన్నీ రాసి ఆయనకు ఇచ్చి పని పూర్తయ్యిందని చెప్పా. ‘నువ్వు చేసిన పని బాగుందో లేదో తెలియదు. కానీ, పని పూర్తి చేశానని చెప్పడం నాకు నచ్చింది. తీసుకున్న పనిని పూర్తి చేయకుండా వాయిదాలు వేసి కారణాలు చెప్పేదాని కన్నా, పని పూర్తి చేయాలనే లక్ష్యంతో వచ్చావు. అది బాగుంది’ అని చెప్పారు. ‘మాయాబజార్’కు అప్రెంటీస్ అసిస్టెంటుగా పని చేయమన్నారు. ‘నీకు ఏమీ తెలియదు. నీకు నిర్మాతతో జీతం ఇప్పించడం సరికాదు. డబ్బులు ఇవ్వలేం. సినిమాలో పేరు ఉండద’ని చెప్పారు. వారం తర్వాత రమ్మన్నారు. వారం తర్వాత వెళ్తే ‘మిస్టర్ శ్రీనివాసరావు.. నిర్మాతలు, దర్శకులకు ఏళ్లు గడిస్తే గానీ రాని అనుభవం వారంలో వచ్చింది. నువ్వు చేయాల్సిన మాయాబజారే లేద’న్నారు. తర్వాత ‘దొంగరాముడు’ చేద్దామన్నారు. అంతలోనే మళ్లీ ‘మాయాబజార్’ మొదలయ్యింది. అదే నాకు తొలి సినిమాగా మారింది.
మొదటిసారి ఎన్టీఆర్‌ను కృష్ణుడి గెటప్‌లో చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి?
సింగీతం శ్రీనివాసరావు : రామారావు కృష్ణుడి గెటప్‌లో వచ్చి నిలబడ్డారు. చుట్టూ అందరూ జనం. కేవీ రెడ్డిగారు అందరి అభిప్రాయం తీసుకున్నారు. ఆయన్ను చూడగానే ఎలా ఉందో చెప్పలేని అనుభూతి కలిగింది. అదో అద్భుతం
డైరెక్షన్ చేశారు.. నిర్మాత, రైటర్, యాక్టర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్స్ రాశారు.. మిగిలినవి ఎందుకొదిలేశారు?
సింగీతం శ్రీనివాసరావు : నాకు ఎంత తెలిసినా, అంతా తెలిసినా ఒక నిపుణుడు చేస్తున్నప్పుడు నోరు మూసుకోవాలని కూడా తెలుసు. ప్రతి ఒక్కరి దగ్గర నాకు కావాల్సింది తీసుకున్నా తప్పితే.. నేను వేలు పెట్టలేదు.
సాంకేతికత అనుకున్నంత లేని సమయంలో మైఖేల్ మదన కామరాజు, విచిత్ర సోదరులు, ఆదిత్య 369 లాంటి చిత్రాలకు స్ఫూర్తి ఎవరు..?
సింగీతం శ్రీనివాసరావు : నేను సైన్స్ స్టూడెంట్‌ను. ఎన్నో పరిశోధనలు చేసేవాళ్లం. ఆ సమయంలోనే హెచ్.జి.వెల్స్ రాసిన పుస్తకాలు చాలా చదివా. అవే నాపై చాలా ప్రభావం చూపించాయి. అలా టైం మెషీన్ నేపథ్యంలో ‘ఆదిత్య 369’ చేశాం. సినిమా అంటే పాట, ఫైట్, సెంటిమెంటు కాదు.. ఒక సమస్య ఉండాలి. దాన్ని పరిష్కరించాలి. అప్పుడే బాగా నిద్ర పడుతుంది. సాధారణంగా జీవితం గడుస్తుంటే సంతోషంగా లేదు. ఛాలెంజింగ్ ఉన్నప్పుడే బాగుంటుంది. దాన్ని మేమే క్రియేట్ చేసుకునే వాళ్లం.
‘మైఖేల్ మదన కామరాజు’లో కథ చెబుతా పాట బాలు గారితో కాకుండా మీరే ఎందుకు పాడారు..?
సింగీతం శ్రీనివాసరావు : మొదట ఇళయరాజా పాడారు. నేను యాక్టింగ్ చేశా. కమల్‌హాసన్ డైరెక్షన్ చేస్తుంటే.. నేను నటించా. కమల్‌కు అదే మొదటి డైరెక్షన్. బాలు కూడా నన్నే పాడాలని నిర్మాతకు చెప్పడంతో పాడాల్సి వచ్చింది. పక్కా ప్రణాళికతో 90 రోజుల్లోనే సినిమాను పూర్తి చేశాం.
వాణిజ్య సినిమాలు వస్తున్న సమయంలో మూకీ సినిమా ‘పుష్పక విమానం’ ఎందుకు తీయాలని అనిపించింది?
సింగీతం శ్రీనివాసరావు : అది వాణిజ్య సినిమానే. కమల్‌హాసన్ ఉన్నాడు ఇంకేం కావాలి..? ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంటున్నారు. ఏ భాష లేకుండా తీస్తే అన్ని భాషల సినిమా అవుతుంది కదా! ఒకే భాషలో తీస్తే కమర్షియలా..? అన్ని భాషల్లో తీసిన సినిమా కమర్షియలా…? చెప్పండి. 13 భాషల్లో విడుదల చేశాం. ఒక టైటిల్ మాత్రమే మారింది. ఈ సినిమాను 45 రోజుల్లో పూర్తి చేశాం. అన్నీ తెలిసిన వారు బాగుందని చెప్పి సినిమా తీయడానికి ముందుకు రాలేదు. ఏమీ తెలియని కన్నడ నాగరాజు మాత్రం ‘నేను ఈ సినిమా చేస్తా’నని ముందుకు వచ్చారు. ఖర్చు గురించి ఆలోచించకుండా సినిమా చేశా. ఆలోచిస్తే ఈ సినిమా ఎవరూ తీయరని భయం.
బాలకృష్ణతో ఎన్ని సినిమాలు చేశారు..? ఆదిత్య 369 ఆయనతోనే ఎందుకు చేయాలనుకున్నారు..? భైరవ ద్వీపంలో విరిసింది పాట వేటూరి కాకుండా మీరే రాశారు కదా..?
సింగీతం శ్రీనివాసరావు : గతం, వర్తమానం, భవిష్యత్తు కాలాల్లోని కథలను అనుకున్నప్పుడు శ్రీకృష్ణదేవరాయలు కథ ఎంచుకున్నాం. దానికి బాలకృష్ణ బాగుంటారని అనిపించింది.వర్తమానం ఆయనే.. భవిష్యత్తులోనూ ఆయనే నటించాల్సి వచ్చింది. విరిసింది పాట వేటూరి రాయాలి. ఆయన అదిగో, ఇదిగో వస్తానని రాలేదు. నాకు సమయం ముఖ్యం. అలా పాటించకపోతే ఇబ్బంది పడుతా. ఆవేశంతో పాట రాసేశాను. ఆ తర్వాత రికార్డింగ్ ఆపేశా. మాధవపెద్ది సురేష్‌తో ఒకసారి వేటూరిని పిలిపించాలని చెప్పా. ఆయన వచ్చి బాగుందని చెప్పిన తర్వాతే ఆ పాట రికార్డింగ్ చేశాం.
ఆదిత్య 369 సినిమా చూసి నాసా నుంచి చాలా మంది వచ్చి అభినందనలు చెప్పారట..? ఈ టైటిలే ఎందుకు పెట్టారు..?
సింగీతం శ్రీనివాసరావు : అవును. అమెరికా, గుంటూరులో ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలు వచ్చి ప్రపంచంలో టైం మెషీన్ మీద వచ్చిన సినిమాలన్నీ చూసి ఆదిత్యలోని టైం మెషీన్ పర్‌ఫెక్ట్‌గా ఉందని తేల్చారు. నాకు సైన్స్ ఫిక్షన్ అంటే ఇష్టం. సాంకేతికత తెలిసి చేసిన సినిమా కాదది. ఏదో మనసుకు తట్టింది చేశా. ఆదిత్య అంటే హీరో పేరు అనుకుంటారు. నాకు 9.. మంచి నంబరు. అందుకే అలా పెట్టాం.
ఆదిత్య 369 సీక్వెల్ తీస్తామన్నారు. కదా..?
సింగీతం శ్రీనివాసరావు : ఆదిత్య 999 సినిమా అనుకున్నాం. బాలకృష్ణకు కూడా చేయాలని ఉంది. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు చేస్తాం. కథ సిద్ధంగా ఉంది.
మాస్ కమర్షియల్ హీరో బాలకృష్ణ కదా..ఆయనతో కురూపి పాత్ర ఎలా చేయించారు..?
సింగీతం శ్రీనివాసరావు : భైరవద్వీపంలో కురూపి పాత్రే హీరో. అందంగా ఉండి, పాటలు పాడుకుంటూ, ఫైట్లు చేసుకుంటే డిస్ట్రిబ్యూటర్లలో హీరోగా ఉంటారేమోగానీ జనంలో కాదు. అనుకోకుండా చేసే పాత్రే హీరోగా జనం భావిస్తారు. అలా రామారావు చేశారు. అలా కురూపిగా చేయడంతో బాలకృష్ణకు పేరు వచ్చింది. పాటలు పాడితే గుర్తింపు ఏం ఉంటుంది. వారం పాటు కష్టపడ్డారు. భోజనం లేదు. జ్యూస్ మాత్రమే తాగేవారు. ఉదయం 9 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటల దాకా మేకప్ అలాగే ఉండేది.
‘ఉమాచండీ గౌరీ శంకరుల కథ’ షూటింగ్ సందర్భంగా ఏం జరిగింది?
సింగీతం శ్రీనివాసరావు : అందులో రామారావు శంకరుని పాత్ర వేస్తున్నారు. పాము మెడలోకి వెళ్లే సన్నివేశం నాలుగు భాగాలుగా అనుకున్నాం. రామారావు అలా అవసరం లేదు. పామును వదిలేయండి. అదే వచ్చేస్తుందని చెప్పారు. అలాగే వెళ్లి ఆయన మెడలో చుట్టుకుంది. ఎవరికీ నోట మాట రాలేదు.
ప్రభాస్ ‘ప్రాజెక్టు కె’కు అశ్వినీదత్ మిమ్మల్ని మెంటర్‌గా ఉండాలన్నారట..?
సింగీతం శ్రీనివాసరావు : స్క్రిప్టు వరకు మాత్రమే మార్పులు, చేర్పులు చేసి ఇచ్చాను. అంతే!
కమలహాసన్‌తో చాలా సినిమాలు చేశారు. సొమ్మొకడిది..సోకొకడిదిలో ఒక విషయంలో బాగా అలిగారట ఎందుకు..?
సింగీతం శ్రీనివాసరావు : సముద్రం ఒడ్డున సినిమా షూటింగ్ జరుగుతోంది. కమల్, జయసుధ డ్యూయెట్ అది. 3 గంటలకల్లా వచ్చేయాలి. 4.30 గంటలకు కూడా రాలేదు. ‘ఎండపోతోంది’ అంటూ గట్టిగా అరిచా. ఎవరో వెళ్లి కమల్‌హాసన్‌ను తిడుతున్నట్టు చెప్పారు. నేరుగా వచ్చి కూర్చున్నారు. ‘నాకు కోపంగా ఉంది. నేను షూటింగ్‌కు రానని డైరెక్టర్‌కు చెప్పండ’ని అసిస్టెంట్‌కు చెప్పాడు. ‘నా కోసం, నీకోసం సూర్యుడు ఉండడు. మళ్లీ రేపు రావాలి కదా’ అనే సరికి అంతా వచ్చేశారు కమల్‌తో ఏడు సినిమాలు చేశా. మా మీద మేమే జోకులు వేసుకుంటాం. విచిత్ర సోదరులు విడుదలయ్యింది. పంజు అరుణాచలం నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు వచ్చారు. నిర్మాత మాట్లాడుతూ.. ‘సినిమా ఎంత హిట్ అయితే అంత డబ్బు చెల్లిస్తా’మని చెప్పారని అన్నారు. నేను ‘హిట్ అవుతుందని గ్యారెంటీ ఏంటీ, ఫ్లాప్ అయితే’ అని అడిగా. డిస్ట్రిబ్యూటర్ల ముందు అలాంటి మాటలేంటనీ నొచ్చుకున్నారు. నాకు సూటిగా మాట్లాడే అలవాటు ఉండటంతో అలా మాట్లాడా. తర్వాత కమల్, నిర్మాత సరికాదని సర్దిచెప్పారు.
మీ సొంతూరు ఎక్కడ..?
సింగీతం శ్రీనివాసరావు : మా నాన్న ప్రధానోపాధ్యాయుడు. అంతా నెల్లూరులోనే తిరిగాం. చదువంతా అక్కడే అయ్యింది. ఉదయగిరిలో పుట్టాను. ఏడాదిన్నర పాటు ఉపాధ్యాయుడిగా పని చేశా. అక్కడ ఆస్తులేం లేవు. ఇల్లు, ఆస్తులున్న ఊరు చెన్నై. అదే సొంతూరుగా మారింది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి మీ వయస్సెంత..? ఆ సమయంలో ఏమైనా ఇబ్బందులు పడ్డరా..?
సింగీతం శ్రీనివాసరావు : అప్పటికి నాకు 16 ఏళ్లు. రేడియో లేదు. తర్వాత రోజు పేపరు వచ్చేది. జెండా ఆవిష్కరణ చేద్దామంటే నాన్న ఉండే పాఠశాలకు వెళ్లా. అక్కడ సంబరాలు చేసుకున్నాం. అందరికీ డబ్బు కావాలి. ఇల్లు ఉండాలి. మేం ఆరోగ్యం బాగుండేలా ప్లాన్ చేసుకున్నాం. విజయ ఆసుపత్రికి దగ్గరగా ఇల్లు ఉండాలనుకున్నాం. అలాగే ఉన్నాం.
మీది ప్రేమ వివాహమా..? పెద్దలు కుదిర్చిన పెళ్లా..?
సింగీతం శ్రీనివాసరావు : పెద్దలు కుదిర్చిన పెళ్లి తర్వాత బాగా ప్రేమించుకున్నాం. 62 ఏళ్లు నాతోనే ఉంది. ఎక్కడికి వెళ్లినా నాతో వచ్చేది. ఆమె ఇప్పుడుంటే బాగుండు. మూడు నెలల క్రితమే కాలం చేశారు. అయినా నన్ను పని చేయాలని చెప్పినట్టే అనిపిస్తుంది. అందుకే ఇక్కడికి వచ్చా. ఇద్దరమ్మాయిలు. ఒకరు చెన్నైలో, మరొకరు యూకేలో ఉన్నారు.
దర్శకుడిగా మీ మొదటి సినిమా ఏది..?
సింగీతం శ్రీనివాసరావు : నీతి-నిజాయితీ. అది మూగవాడి కథ. అది సూపర్ డూపర్ ఫ్లాప్.
జపాన్ అనే వ్యక్తి లేకపోతే విచిత్ర సోదరులు లేరని అంటారు..ఎవరతను..?
సింగీతం శ్రీనివాసరావు : అవును. తమిళ్ వ్యక్తి. అతన్ని అందరం జపాన్ అంటాం. మరుగుజ్జు పాత్రకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అతనే చూసుకున్నారు. అతను లేకపోతే ఆ సినిమా లేదు. కమల్‌హాసన్ కూడా అదే మాట అన్నారు.
ఉషాకిరణ్ మూవీస్‌లో ‘మయూరి’ చేశారు. సుధాచంద్రన్‌ను హీరోయిన్‌గా మీరే పెట్టాలనుకున్నారా.? రామోజీరావు సూచించారా..?
సింగీతం శ్రీనివాసరావు : ఎంపిక నాదే. ఒప్పుకోవడం ఆయన గొప్పతనం. హీరోయిన్‌తో సినిమా తీసి.. చివర్లో సుధాచంద్రన్‌తో నృత్యం చేద్దామనుకున్నాం. కథ నడుస్తున్నప్పుడు అట్లూరి రామారావుకు చెప్పాను. ఆయన సుధా చంద్రన్‌ను పిలిపించారు. అందరం కలిసి మాట్లాడుతుంటే.. ఆమె కళ్లలో ఏదో సాధించాలనే పట్టుదల ఉన్నట్టు కనిపించింది. ఇదే విషయాన్ని రామోజీరావుకు చెప్పా. ఆమెను ఎంపిక చేయాలనడంతో ఓకే అన్నారు. తొలిరోజు డైలాగ్ చెప్పడం రాక గదిలోకి వెళ్లి ఏడ్చేసింది. నేను వెళ్లి కాలు పోతే జైపూర్ వెళ్లి కాలు పెట్టించుకొని నృత్యం చేశావ్.. చిన్న డైలాగులకు భయపడుతున్నావా..?అనడంతో వెనుదిరిగి చూడకుండా సినిమా పూర్తి చేశాం.