”బోనాల పాట” వివాదపై సింగర్‌ మంగ్లీ క్లారిటీ

జులై 11న మంగ్లీ అఫీషియల్‌ యూట్యూబ్‌ ఛానెల్‌ లో ఈ ఏడాది బోనాల సాంగ్‌ రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే… ఈ పాటపై గత మూడు రోజులుగా సోషల్‌ మీడియా పెద్ద జరుగుతోంది. ”చెట్టు కింద కూసున్నవమ్మా… సుట్టం లెక్క ఓ మైసమ్మా” అంటూ సాగే ఈ పాటపై తెలంగాణకు చెందిన పలువురు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ దుమారం లేపారు. బోనాల పాటలో అమ్మవారి పై తప్పుడు పదాలు ఉపయోగించారని సింగర్‌ మంగ్లీపై మండిపడుతున్నారు. ఇక బీజేపీ పార్టీ కార్యకర్తలైతే.. ఏకంగా కేసు పెట్టేశారు. అయితే.. ఈ వివాదంపై మంగ్లీ క్లారిటీ ఇచ్చారు. ఈ పాటలో ఎలాంటి వివాదస్పద పదాలను వాడలేదంటూ తన సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ ద్వారా పేర్కొన్నారు మంగ్లీ.

ఈ పాటను ప్రఖ్యాత జానపద పాటల రచయిత పాలమూరు రామస్వామి 25 ఏళ్ళ క్రితమే రచించారని పేర్కొన్న మంగ్లీ…. పాలమూరు ప్రాంతంలో కోలాటంలో ఈ పాట చాలా ప్రసిద్ది అని తెలిపారు. 2008లో ఈ పాటను DRC ఆడియో సంస్థవారు సిడీ రూపంలో కూడా విడుదల చేశారని… ఆ పెద్దాయన రాసిన జానపదాలు తనకు చాలా ఇష్టం అని వెల్లడించారు. ఆయన మీద అభిమానంతో స్వయాన ఆయన్ని కలిసి ఈ పాటను తీసుకున్నామని… ఈ పాట వీడియోలో రామస్వామిగారిని కూడా చిత్రీకరించామని చెప్పుకొచ్చింది మంగ్లీ.

” ‘‘చెట్టుకింద కూసున్నవమ్మ చుట్టం లెక్క ఓ మైసమ్మ’’ అని సాగే ఈ పాటలో ‘మోతెవరి’ అనే పదంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రచయిత రామస్వామిగారి అభిప్రాయం ప్రకారం మోతెవరి అంటే గ్రామంలో పెద్ద అనే అర్థంలో ఈ పాట సాగుతుంది. ప్రస్తుతం ఆ పదం వ్యతిరేక పదంగా వాడుకలోకి వచ్చిందన్నది వాదన. నిందాస్తుతిలో కోలాటం రూపంలో సాగే ఈ పాటను మాకు తెలిసిన కొంతమంది కళాకారులు,పెద్దల సలహాలు తీసుకుని చిత్రీకరించాము.  గ్రామదేవతల ఒగ్గు కథలు, బైండ్లోల కొలుపులు ఇలా రకరకాల ఆచారాలు ఉన్నాయి. భక్తిలో కూడా మూఢ భక్తి,వైరి భక్తి అని రకరకాలుగా ఉన్నాయి.. అందులో భాగంగానే ఈ పాటను రూపొందించాము.” అంటూ మంగ్లీ క్లారిటీ ఇచ్చారు.

ఈ విషయంలో తనపై చాలా మంది అసభ్యకరంగా కామెంట్లు పెడుతున్నారని సీరియస్‌ అయింది. ఒక ఆడబిడ్డతో ఎలా మాట్లాడాలో సంస్కారం కూడా తెలియదని మండిపడ్డారు. ఈ పాటపై విమర్శలు వచ్చినరోజే పాటను మార్చే అవకాశం ఉన్నప్పటికీ, పాట కోసం ప్రాణంపెట్టిన 80 ఏళ్ల వృద్ద రచయిత రామస్వామి గారిని తక్కువ చేయవద్దనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకోలేకపోయానని తెలిపారు. కానీ దీన్ని మరింత వివాదం చేసి ఆయన్ని కూడా కించపరుస్తున్నారని, ఆ పెద్దాయన కుటుంబ సభ్యుల అనుమతితో లిరిక్స్ లో మార్పులు చేశామని తెలిపారు మంగ్లీ. ఈ కొత్త పాట వీడియోను రిలీజ్‌ చేస్తున్నామని తెలిపారు.