దేశవ్యాప్తంగా పెగసస్ స్పై వేర్ దుమారం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దాని ద్వారా ప్రభుత్వం ప్రజలపై నిఘా ఉంచుతుందని, కొందరు ప్రముఖల ఫోన్లను హ్యాక్ చేస్తుందని ఆరోపణలు వచ్చాయి. దీంతో దేశంలో ఈ వ్యవహారం రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోంది. ఆ స్పై వేర్ ను సృష్టించిన ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్‌వో గ్రూప్ కేవలం ప్రభుత్వాలకు మాత్రమే దాన్ని అమ్ముతామని స్పష్టంగా చెప్పింది. దీంతో మరింత దుమారం చెలరేగింది. అయితే స్పై వేర్ నిజానికి ఫోన్లలో ఉన్నట్లు యూజర్లకే తెలియదు. అంత పకడ్బందీగా రూపొందించారు. దీని వల్లే మరింత వివాదం రాజుకుంటోంది.
సాధారణంగా ఏ స్పై వేర్ అయినా సరే యూజర్ల ఫోన్లలోకి అంత తేలిగ్గా ప్రవేశించదు. యూజర్ ఏదైనా లింక్‌ను ఓపెన్ చేసినా, ఫైల్‌ను డౌన్ లోడ్ చేసినా, యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసినా స్పై వేర్ వ్యాప్తి చెందుతుంది. కానీ పెగసస్ స్పై వేర్ అలా కాదు. అది ఫోన్‌లో ఉన్నట్లు యూజర్‌కు ఏమాత్రం తెలియదు. మరెలా అది వ్యాప్తి చెందుతుంది ? అంటే యూజర్లు వాడే సామాజిక మాధ్యమాలై వాట్సాప్ వంటి యాప్ లలలో ఉండే లోపాలను ఆధారంగా చేసుకుని ఇలాంటి స్పై వేర్ ను వ్యాప్తి చెందిస్తారు. దీంతో యూజర్ల ఫోన్లపై నిఘా ఉంచుతారు. అందుకనే వాట్సాప్ మాతృసంస్థ ఫేస్ బుక్ ఎన్ఎస్‌వో గ్రూప్‌పై 2019లో దావా వేసింది.
పెగసస్ స్పైవేర్‌ను ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకుల ఫోన్లు, జర్నలిస్టులు, ఇతర యాక్టివిస్టుల ఫోన్లను ట్రాక్ చేసేందుకు ఉపయోగిస్తున్నారు. అంటే.. కేవలం వారు మాత్రమే కాదు, వారికి సన్నిహితంగా మెలిగే వారి ఫోన్లను కూడా ట్రాక్ చేస్తారు. ఎందుకంటే వారితో వాట్సాప్‌లో పలు గ్రూప్‌లో ఇతరులు కూడా ఉంటారు కదా. కనుక ఇతరుల ఫోన్లను కూడా ట్రాక్ చేస్తారు. అందువల్ల ఎవరూ సురక్షితం కాదు. పెగసస్ స్పై వేర్ నుంచి తప్పించుకోవడం ఎవరితరమూ కాదు. మరి దాన్నుంచి ఎలా తప్పించుకోవాలి ? అంటే.. అది మన చేతుల్లో లేదు, కాలమే సమాధానం చెప్పాలి.