కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడానికి ఉన్నతాధికారులు రంగంలోకి దిగుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్ సోమవారం రోడ్లపైకి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లఘించినవారి వాహనాలను సీజ్ చేశారు. అలాగే రోడ్లపై తిరుగుతున్నవారిని మీకేమైనా ప్రత్యేకమైన రూల్స్ ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. అనవసరంగా రోడ్లపైకి రావద్దని హితవుపలికారు. బైక్‌లతో రోడ్లపైకి వచ్చిన కొందరు యువకులను ఇళ్లకు వెళ్లాలని హెచ్చరించారు. ప్రజలందరూ ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని ఆయన కోరారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడానికి కలెక్టర్ చేపట్టిన చర్యలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రజలు కూడా లాక్‌డౌన్‌కు సహకరించి కరోనా వ్యాప్తిని నివారించాలని కోరుతున్నారు.
కాగా, కరోనా కట్టడి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి 31వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ఎవరూ బయటకు రావద్దని కోరారు. పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా.. రేషన్‌కార్డుపై ఉచిత బియ్యం, ఇతర సరుకుల కోసం రూ. 1500 ఇవ్వనున్నట్టు తెలిపారు. మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని పిలుపునిచ్చారు.