ప్రపంచ దేశాలపై కరోనా వైరస్ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో అందరికీ తెలిసిందే. ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే లాక్ డౌన్‌లోకి వెళ్లిపోయాయి. మన దేశంలోనూ అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలకు ప్రస్తుతం కేవలం నిత్యావసర సరుకులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక అవసరం లేని దుకాణాలు, షాపులు, మాల్స్‌ను మూసివేశారు. అయితే ఇదే పరిస్థితి ముందు ముందు కొనసాగితే దేశంలోని రిటెయిల్ సెక్టార్‌కు చెందిన 60 లక్షల మంది తమ తమ ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
దుస్తులు, బంగారం తదితర అవసరం కాని దుకాణాలను ఇప్పటికే మూసివేయించారు. మరో వైపు కరోనా కారణంగా అన్ని రంగాలు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటున్నాయి. అయితే పరిస్థితి ముందు ముందు మెరుగు కాకపోతే ఆయా రంగాలకు విపరీతమైన నష్టాలు వస్తాయి. దీంతో ఆ నష్టాలను తట్టుకునేందుకు షాపులను మూసివేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని రిటెయిలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ) అంచనా వేస్తోంది.
అయితే భవిష్యత్తులో కరోనా ప్రభావం తగ్గినప్పటికీ అన్ని రంగాలు ఇంకా నష్టాల్లోనే ఉంటాయని, కనుక కొన్ని స్టోర్లను మూసివేయాల్సి వస్తుందని, అలా అయినా కొందరు ఉద్యోగాలు కోల్పోతారని ఆర్ఏఐ చెబుతోంది. ఇక కేవలం మరో 45 రోజుల పాటు మాత్రమే తమ ఉద్యోగులకు తాము అండగా ఉండగలమని, ఆ తరువాత మ్యాన్ పవర్ ఖర్చులను తగ్గించుకునేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని వి మార్ట్ రిటెయిల్ సంస్థ ఎండీ లలిత్ అగర్వాల్ తెలిపారు. మొత్తంగా చెప్పాలంటే… కరోనా వల్ల రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ముందు ముందు పరిస్థితి ఏవిధంగా ఉంటుందో చూడాలి..!