గుజరాత్ కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటన దేశవ్యాప్తంగా విషాదం నింపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి 9 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు రాజ్‌కోట్ ఐజీ అశోక్ యాదవ్. అరెస్ట్ చేసిన వారిలో వంతెన నిర్వహణ సంస్థ ఒరేవాకు చెందిన ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు టికెట్ క్లర్క్స్, ఇద్దరు కాంట్రాక్టర్లు, ముగ్గరు సెక్యూరిటీ గార్డులు ఉన్నట్లు వెల్లడించారు. ప్రమాదానికి బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఈ ఘటనపై దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అశోక్ యాదవ్ తెలిపారు. వెలికితీత చర్యల్లో పోలీసులు, స్థానికులు సహాయపడ్డారని వివరించారు. ఆదివారం రాత్రి జరిగిన మోర్బీ దుర్ఘటనలో 130కిపైగా మంది ప్రాణాలు కోల్పోగా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఈ ఘటనపై తీవ్ర భావోద్వేగానికి గురైన ప్రధాని మోదీ రేపు.. ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నట్లు గుజరాత్ సీఎంఓ వెల్లడించింది. ఇవాళ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని మాట్లాడిన ప్రధాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తాను కేవడియాలోనే ఉన్నా తన మనసంతా మోర్బీ బాధితుల గురించే ఆలోచిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.