దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా తగ్గలేదు ఈలోపే కేరళలో మరో కొత్త అంటువ్యాధి వెలుగు చూసింది. షిగెల్లా బ్యాక్టీరియా బారిన పడి 11 ఏళ్ల చిన్నారి కేరళలోని కోజికోడ్ లో మృతి చెందాడు. సదరు బాలుడు రెండు రోజుల కిందట షిగెల్లాతో ప్రాణాలు కోల్పోగా ఆ చిన్నారితో సన్నిహితంగా మెలిగిన పలువురు కూడా అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదయ్యాయని, మరో 20 మందికి కూడా సోకినట్లు అనుమానిస్తున్నట్లు లోకల్ వైద్యాధికారులు తెలిపారు.
ఈ వ్యాధి సోకిన వారికి డయేరియా, జ్వరం, కడుపు నొప్పి లక్షణాలు ఉంటాయి. కొంత మందికి ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు కానీ మూడు రోజులకు మించి డయేరియా, ఇతర లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుందని చెబుతున్నారు. షెగెల్లా బ్యాక్టీరియా ముఖ్యంగా ఆహారం, నీటి ద్వారా వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. షిగెల్లా వల్ల బాలుడు చనిపోవడంతో ఆ ప్రాంతంలోని నీటి వనరులను అధికారులు శానిటైజ్ చేశారు.