సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదంలో ఆరుగురు దుర్మరణం

-

సికింద్రాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం భారీ నష్టాన్ని మిగిల్చింది. పాతికేళ్లు కూడా నిండని ఆరుగురు యువకులను బలితీసుకుంది. కాల్‌సెంటర్‌లో పనిచేసే నలుగురు యువతులు, ఇద్దరు యువకులు గురువారం ఈ ప్రమాదంలో చిక్కుకుని పొగతో ఊపిరాడక మృత్యువాతపడ్డారు. ఇటీవల మినిస్టర్‌రోడ్‌లోని డెక్కన్‌మాల్‌లో ప్రమాదం జరిగి ముగ్గురు మరణించగా.. తాజాగా ప్యారడైజ్‌ సమీపంలోని స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ మంటల్లో చిక్కుకుంది.

గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో మంటలు అంటుకున్నాయి. మొత్తం 8 అంతస్తుల్లో విస్తరించి ఉన్న ఈ భవనంలో తొలుత ఏడో అంతస్తులో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. తర్వాత 4వ అంతస్తు వరకు వ్యాపించాయి. 5వ అంతస్తులో పేలుడు సంభవించడంతో మంటలు తీవ్రమయ్యాయి. ఇందులో వస్త్ర దుకాణాలతోపాటు కంప్యూటర్‌ ఇన్‌స్టిట్యూట్‌లు, కాల్‌ సెంటర్లు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ఉండటంతో నిత్యం రద్దీగా కన్పిస్తుంది.

ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో పనిచేసే వారితోపాటు షాపింగ్‌కు వచ్చిన వారంతా గబగబా కిందికి దిగిపోయారు. పొగ, అగ్నికీలలతో పెయింట్‌ డబ్బాల లాంటివి పేలడంతో కొందరు కిందికి రాలేకపోయారు. మంటల్లో దాదాపు 15 మందికి పైగా చిక్కుకుపోవడంతో అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద భారీ క్రేన్ల సాయంతో కాపాడారు. వీరిలో ఆరుగురిని అపస్మారక స్థితిలో బయటికి తీసుకొచ్చారు. వారి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉండటంతో ఆసుపత్రులకు తరలించారు. గాంధీ ఆసుపత్రిలో ప్రమీల (22) వెన్నెల(22) శ్రావణి(22), త్రివేణి(22), శివ(22)లు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Read more RELATED
Recommended to you

Latest news