విశాఖ మన్యం గంజాయి పంటకు అడ్డాగా మారుతున్న సంగతి కొన్నేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అడపా దడపా ఎక్సైజు పోలీసులు దాడి చేయడం.. గంజాయిని పట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు ఎక్సైజ్ పోలీసులు స్థానిక పోలీసుల అండతో గంజాయి తోటలను కూడా ధ్వంసం చేస్తున్నారు. కానీ విశాఖ మన్యంలో గంజాయి సాగు ఎంతగా పెరిగిపోయిందో వివరించే ఘటన తాజాగా జరిగింది.
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఏకంగా 6 టన్నుల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంచంగిపుట్టు మండలంలోని బిర్రిగుడలో ఈ గంజాయి నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ గంజాయి ఉందన్న సమాచారంతో తనిఖీలకు వెళ్లిన ఎక్సైజ్ పోలీసులకు అనేక షాకింగ్ న్యూస్ తెలిశాయి.
ఆంధ్రా- ఒరిస్సా సరిహద్దుల్లో ఈ గంజాయి భారీ ఎత్తున పండిస్తున్నారట. దీన్ని విశాఖలోని మారుమూల పల్లెల్లో నిల్వ ఉంచుతున్నారు. ఈ గంజాయి నిల్వలను కొన్ని ఇళ్లలో దాచి పెడతారు. ఆ నిల్వలకు ఒకరిద్దరిని కాపలాకు ఉంచుతారు. ఇలా కాపాలా ఉండేవారికి ఏకంగా రోజుకు వెయ్యి రూపాయల చొప్పున వేతనం ఇస్తోందట గంజాయి ముఠా.
ఇక్కడ బిర్రిగుడలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో దాదపు కొన్ని ఇళ్లలో దాచి ఉంచిన గంజాయి నిల్వలను చూసి పోలీసులే ఆశ్చర్యపోయారట. ఏదో పది కేజీలో వంద కేజీలో కాదు.. ఏకంగా ఆరు టన్నుల గంజాయి ఇక్కడ దొరికింది. దీని మార్కెట్ విలువ.. కనీసం 10 నుంచి 20 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
దీన్ని ఒక్కో కేజీ 30 వేల వరకూ టోకున నగరాల్లో అమ్మేస్తారట. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, గుంటూరు వంటి ఏపీ, తెలంగాణ నగరాలే కాకుండా మిగిలిన రాష్ట్రాలకూ సరఫరా చేస్తారట. అంటే ఈ గంజాయి మాఫియా ఏ రేంజ్ లో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.