పరీక్షల్లో విద్యార్థి “స్లిప్” లు పెడితే… ఫలితం డిబార్! అలాగే ప్రభుత్వంలో మంత్రులు – వారి పుత్రరత్నాలు “స్లిప్”లు పెడితే… ఫలితం పార్టీ డిబార్! ప్రస్తుతం ఏపీ ప్రజలనుంచి తిరస్కారాన్ని అత్యంత బలంగా ఎదుర్కొన్న టీడీపీకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే…. కర్నుడి చావుకి ఉన్నన్ని కారణాలు ఉన్నాయని అంటారు వైకాపా నేతలు! అందులో ఒక కారణం తాజాగా వెలుగులోకి వచ్చింది!
ఈఎస్‌ఐ లో కార్మికుల కడుపు కొట్టి రూ.కోట్లు కొట్టేసిన అప్పటి నేతల అవినీతి ఒక్కొక్కటే బయటకు వస్తున్న సమయంలో… ఏజెన్సీల నుంచి వచ్చే కమీషన్ల కోసం కక్కుర్తి పడి, నాణ్యతను గాలికొదిలేసి, కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టిన తరుణంలో… గత ప్రభుత్వంలోని కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ హయాంలో జరిగిన అవినీతి తాజాగా బయటికొచ్చింది.
వివరాళ్లోకి వెళ్తే… 2016లో తయారైన పారాసెటిమాల్ మాత్రలు 2019 ఆగస్ట్ తో ఎక్స్‌పెయిరీ అవుతాయన్న ఉద్దేశంతో.. ఆదరాబాదరాగా 2019 ఫిబ్రవరిలో ఈఎస్‌ఐ ఆస్పత్రులకు సరఫరా చేశారట. అయితే.. ఈ మాత్రలు పనికిరానివని, సరఫరా చేసిన ఏజెన్సీని రద్దుచేయండని ఔషధ నియంత్రణ శాఖ ఒక నివేధిక ఇవ్వగా… ఆ నివేదికను మంత్రి పితాని ఒత్తిడి మేరకు చెత్తబుట్టలో వేశారంట.
2019 ఫిబ్రవరిలో ఈ మాత్రలను పరిశీలించిన అనంతరం.. ఇవి నాసిరకం అయినవంటూ తిరుపతి డ్రగ్ ఇన్‌స్పెక్టర్ నివేదిక ఇచ్చినా.. అప్పటి మంత్రి పితాని ఒత్తిళ్ల మేరకు నాటి ఈఎస్ఐ డైరెక్టర్ చర్యలు తీసుకోలేదట! అనంతరం ఈ మందులు సరఫరా చేసిన ఏజెన్సీని కాపాడేందుకు మంత్రి తీవ్రంగా యత్నించినట్టు తెలుస్తోంది.
ఇవన్నీ ఒకెత్తు అయితే… ఈ వ్యవహారంలో కీ రోల్ పోషించినట్లుగా చెబుతున్నా పితాని పుత్రరత్నం వెంకట సురేష్… తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగానే సంపాదించాడని అంటున్నారు! ఈ విషయాలపై స్పందించిన కొందరు ఈఎస్ఐ అధికారులు… మంత్రి కొడుకు స్లిప్పులు రాసి తమకు పంపించేవారని… వాటి ఆధారంగా కాంట్రాక్టులో లేని ఏజెన్సీల నుంచి మందులు కొనుగోళ్లు చేశాం అని… బిల్లుల చెల్లింపుల్లోనూ స్లిప్పులు రాసి పంపించేవారని… పని అయిన అనంతరం ఆ స్లిప్ లను చించేసేవాళ్లం అని చెప్పుకొచ్చారంట! ఇది మ్యాటర్…! ప్రజలు డిబార్ చేయడంలో తప్పులేదు కదా!!