కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై ఆది నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ యాత్రపై బీజేపీ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఘాటుగానే స్పందిస్తోంది. భారత్ జోడో యాత్రపై కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ యాత్రపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు.
దేశ ఐక్యతను ఎవరు దెబ్బతీశారని.. ఇప్పుడు ఇటువంటి యాత్ర చేపట్టాల్సిన అవసరం వచ్చిందని ప్రశ్నించారు. ‘దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎవరు సాహసించారో ఆయన ముందు సమాధానం చెప్పాలి. దేశం ముక్కలు ముక్కలవుతుంది అని నినాదాలు చేసిన వ్యక్తిని మీ పార్టీలో సభ్యుడిగా చేర్చుకున్నారు’ అని గుర్తుచేశారు. కర్ణాటకలోని దొడ్డబల్లాపురలో నిర్వహించిన కార్యక్రమంలో స్మృతి ఇరానీ ఈ మేరకు ప్రసంగించారు. రాహుల్ గాంధీ దేశానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారని ఆరోపిస్తూ.. ఆయన అధికార దాహాన్ని చూసి షాక్ అయినట్లు పేర్కొన్నారు.