‘అరే వాడు పాములాగే పగబడ్తాడు రా’ అని అంటూ ఉంటాం. పాము పగబడితే జన్మజన్మలకు అది తొలగిపోదని నమ్ముతుంటారు. ఇది నిజమే అనిపించేలా ఇప్పటికే చాలా సినిమాలు కూడా వచ్చాయి. అయితే నిజజీవితంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగినట్లు అప్పుడప్పుడు వింటూ ఉంటాం. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లోని అగ్రా జిల్లాలో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది.
ఆగ్రా జిల్లాలోని మన్‌కేఢా గ్రామానికి చెందిన రామ్ కుమార్ చాహర్ కుమారుడు రజత్ చాహర్. డిగ్రీ చదువుతున్న ఈ కుర్రాడు ఈనెల 6న రాత్రి 9 గంటలకు బయట వాకింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో అతడి ఎడమ కాలిపై పాము కాటేసింది. గట్టిగా అరవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. 4 గంటల పాటు పరీక్షించిన వైద్యులు అతడికి పాముకాటు లక్షణాలేవి కనిపించలేదని చెప్పారు.
సెప్టెంబర్ 8న సాయంత్రం ఇంటి బయట ఉన్న బాత్రూమ్కు వెళ్లాడు రజత్. అప్పుడు అతడి ఎడమ కాలిపై మరోసారు పాము కాటేసింది. రజత్‌ను హుటాహుటిన ముబారక్‌పుర్ తీసుకెళ్లి, నాటు వైద్యుల దగ్గర చికిత్స చేయించారు. అయినా ఆ పాము అతడ్ని విడిచి పెట్టలేదు.
ఈనెల 11న ఇంట్లోని ఓ గదిలో ఉండగా, 13న బాత్రూమ్లో ఉండగా, 14న చెప్పులు వేసుకుంటుండగా రజత్‌ను పాము కరిచింది. ప్రతిసారి కుటుంబ సభ్యులు అతడ్ని తీసుకెళ్లి చికిత్స చేయించారు. రజత్‌ను ‘పాము వెంటాడడం’ గురించి మన్‌కేఢా గ్రామస్థులు జోరుగా చర్చించుకుంటున్నారు. అనేక మంది అతడి ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు.