సామాజిక దూరం వల్లనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని చెప్పి అందరూ అదే సూత్రాన్ని పాటిస్తున్నారు. అందులో భాగంగానే మనిషికి, మనిషికి మధ్య దూరం కనీసం 6 అడుగులు ఉండాలని నిపుణులు చెప్పారు. జనాలు కూడా అదే దూరాన్ని పాటిస్తున్నారు. అయితే కరోనా వైరస్ నిజానికి 6 కాదు, 18 అడుగుల దూరం వరకు వ్యాప్తి చెందుతుందని సైంటిస్టుల తాజా పరిశోధనలో వెల్లడైంది. కరోనా సోకిన వ్యక్తి నుంచి వెలువడే తుంపరలు గాలిలో ఆవిరై 18 అడుగుల దూరం వరకు వ్యాప్తి చెందుతాయని సైంటిస్టులు తేల్చారు.
సైప్రస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ నికోసియా పరిశోధకులు గాలిలో కరోనా గరిష్టంగా ఎంత దూరం వరకు వ్యాప్తి చెందుతుందనే విషయంపై పరిశోధన చేశారు. అందుకు గాను వారు కంప్యూటర్ సిములేటర్‌ను ఉపయోగించారు. కరోనా సోకిన వ్యక్తి నుంచి వెలువడే తుంపరలు గాలిలో ఆవిరై అవి 18 అడుగుల దూరం వరకు వ్యాప్తి చెందుతాయని గుర్తించారు. అది కూడా కేవలం 5 సెకన్లలోనే అవి వ్యాప్తి చెందుతాయని తేల్చారు. కాగా ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలను ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు.
అయితే గంటకు 4 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే సందర్భంలోనే అలా కరోనా తుంపరలు 18 అడుగుల దూరం వరకు 5 సెకన్లలో వ్యాపిస్తాయని సైంటిస్టులు గుర్తించారు. భిన్న వాతావరణ పరిస్థితుల్లో ఇది మారవచ్చని వారంటున్నారు. గాలి వేగం ఎక్కువగా ఉంటే.. ఇంకా త్వరగానే వైరస్ వ్యాపించవచ్చని వారు అంటున్నారు. అందుకని ప్రజలు ఈ విషయంపై అప్రమత్తంగా ఉండాలని వారంటున్నారు.