థాయ్‌లాండ్‌లో ఓ సైనికుడు ఉన్నట్టుండి ఉన్మాదిలా మారాడు. బ్యాంకాక్‌లోని ఒక ఆర్మీక్యాంప్‌లో తన పై అధికారితో గొడవపడ్డ సైనికుడు అతన్ని అక్కడికక్కడే కాల్చిచంపాడు. అడ్డొచ్చిన మరో ఇద్దరిని కూడా కాల్చేశాడు. అనంతరం వారి దగ్గరున్న ఆయుధాలు తీసుకుని ఓ వాహనంలో పరారయ్యాడు. దారి వెంట కనిపించిన వారిపైనల్లా కాల్పులు జరుపుతూ మువాంగ్ జిల్లాలోని టెర్మినల్ 21 షాపింగ్ మాల్‌కు చేరుకున్నాడు. అక్కడ కూడా విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
ఆ తర్వాత దుండగుడు కాల్పులు జరుపుకుంటూనే షాపింగ్ మాల్‌లోని 4వ అంతస్తుకు చేరుకున్నాడు. అక్కడ 16 మందిని బెదిరించి ఒక గదిలోకి పంపి బంధీలుగా చేసుకున్నాడు. ఈ కాల్పుల్లో 17 మంది ప్రాణాలు కోల్పోవడమేగాక, మరో 14 మంది తీవ్రంగా గాయపడినట్లు బ్యాంకాక్‌లోని ఎరవాన్ బేస్ క్యాంప్ అధికారులు తెలిపారు. కాల్పుల సమయంలో జనం.. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. షాపింగ్‌మాల్‌లోని టేబుళ్లు, దర్వాజాల చాటుకు నక్కారు. మరికొందరు బయటికి పరుగులు తీసి కార్ల చాటుకు, బైకులు చాటుకు దాక్కున్నారు.
అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఘటనతో టెర్మినల్ 21 షాపింగ్ మాల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అరుపులు, ఏడుపులతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ఇదిలావుంటే అన్ని ఎమర్జెన్సీ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి దుండగుడి చెరలో ఉన్న 16 మంది బంధీలను విడిపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.