ఏపీకి కేంద్రం వేలకోట్ల నిధులిచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కి ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. రాయచోటి లో ఇసుక మాఫియా చేస్తున్న చీఫ్ విప్ బీజేపీ పై విమర్శలు చేస్తారా అంటూ మండిపడ్డారు. రాత్రి పగలు అని తేడా లేకుండా జేసీబీలు, ప్రొక్లైన్ లతో ఇసుక అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికకు కేంద్ర బలగాలను కేటాయించారని సోము వీర్రాజు అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘ నిర్ణయాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బద్వేలు భూ ఆక్రమణలు జరిగిన బాధితులకు అండగా ఉంటామన్నారు. భూ ఆక్రమణలు జరిగిన వారందరికీ తిరిగి వారి భూములు ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బద్వేలు నీటి సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పారు. బద్వేలులో ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేస్తామని…ప్రత్యేక అభివృద్ధి మోడీ సొంతమని అన్నారు. రాష్ట్రంలో వేల కోట్ల నిధులు కేంద్రం ఇచ్చిందంటూ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. అభివృద్దే లక్ష్యంగా బీజేపీ పని చేస్తుందని..బద్వేలు అభివృద్ధి పై దమ్ముంటే బీజేపీ అభ్యర్థి తో శ్రీకాంత్ రెడ్డి చర్చకు రావాలని సవాల్ విసిరారు.