త్వరలో పురపాలికల్లో సిబ్బంది కొరతను అధిగమించేందుకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ని పూర్తి చేస్తామని.. పురపాలికల్లో వార్డ్ ఆఫీసర్ల వ్యవస్థ, ఇందుకు సంబంధించిన సిబ్బంది నియామకం త్వరలో పూర్తి అవుతుందని మంత్రి కేటీఆర్ ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని నగరపాలికల మేయర్లు, చైర్ పర్సన్లు, కమిషనర్లతో పట్టణ ప్రగతి పైన జరిగిన సమావేశంలో ప్రసంగించారు మంత్రి కేటీఆర్.
ప్రభుత్వంలో, ప్రజల కోసం నిరంతరం, అత్యధికంగా కష్టపడుతున్న విభాగాల్లో పురపాలక శాఖ ఒకటి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని.. సంవత్సరం పొడుగునా ప్రతి రోజూ పని చేసినా, ప్రజల నుంచి ప్రత్యేకంగా ప్రశంసలు రావు, ఏదో ఒక కారణం వల్ల పురపాలక శాఖ లో పని ఆగిపోతే ప్రజల నుంచి విమర్శలు ఎదురవుతాయన్నారు.
అందుకే ఈ శాఖలో ప్రజల కోసం పనిచేస్తున్న సమర్థవంతమైన అధికారులను, పురపాలక శాఖ తరఫున అభినందించేందుకు పట్టణ ప్రగతి పురస్కారాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈరోజు పట్టణ ప్రగతి పురస్కారాలు అందుకున్న పురపాలికల్లోని ప్రజాప్రతినిధులకు పురపాలక సిబ్బంది కి అభినందనలు తెలిపారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంను వేగంగా అభివృద్ధి చెందుతున్న అర్బన్ రాష్ట్రం గా చెప్పవచ్చు. ఇప్పటికే సుమారు 46 శాతం ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 5నుంచి 6 సంవత్సరాలో సగానికి పైగా జనాభా తెలంగాణలో పట్టణాల్లో నివసించపోతున్నదని వెల్లడించారు.