ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. కొత్త ప్రైవసీ పాలసీ ఏమోగానీ వాట్సాప్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అయింది. యూజర్ల ఒత్తిడి మేరకు వాట్సాప్ వెనక్కి తగ్గక తప్పలేదు. అయితే ఆ విషయం పక్కన పెడితే వాట్సాప్ ఎప్పటికప్పుడు యూజర్లకు కొత్త ఫీచర్లను అందించడంలో వెనుకడుగు వేయడం లేదు. ఈ క్రమంలోనే మరొక అద్భుతమైన ఫీచర్‌ను వాట్సాప్ త్వరలో యూజర్లకు అందుబాటులోకి తేనుంది.
ఇకపై వాట్సాప్ వెబ్ ద్వారా కూడా వాయిస్, వీడియో కాల్స్ చేయవచ్చు. ఇందుకు గాను యూజర్ వాట్సాప్ వెబ్‌లో ఆయా బటన్లను క్లిక్ చేసినప్పుడు మైక్, కెమెరాలకు అనుమతి ఇవ్వాలి. అనంతరం తాను కావాలనుకున్న యూజర్‌కు వాట్సాప్ వెబ్ ద్వారానే వాయిస్ లేదా వీడియో కాల్ చేయవచ్చు. అలాగే ఇతరుల కాల్స్ ను వాట్సాప్ వెబ్ ద్వారా కూడా స్వీకరించవచ్చు.
కాగా ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా దశలో ఉంది. అందువల్ల కేవలం కొద్ది మంది ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. దీన్ని వాట్సాప్ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. ఈ ఫీచర్‌ను వాడుతున్న యూజర్లు అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వాటిల్లో తెరపై భాగంలో వీడియో, కాల్ ఐకాన్లను గమనించవచ్చు. సెర్చ్ బటన్ పక్కనే అవి ఉన్నాయి. వాటిని ఉపయోగించి వీడియో, వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది కానీ అతి త్వరలోనే ఈ ఫీచర్‌ను యూజర్లకు అందిస్తారని తెలుస్తోంది.