మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు నూతన తరహా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. కోవిడ్ లక్షణాలు ఉంటేనే చాలా మంది గుర్తించి పరీక్షలు చేయించుకుని పాజిటివ్ వస్తే మందులు వాడుతున్నారు. అయితే లక్షణాలు లేని వారిని గుర్తించడం కష్టతరం అవుతోంది. కోవిడ్ లక్షణాలు ఏమీ కనిపించకున్నా చాలా మంది కోవిడ్ బారిన పడుతున్నారు. అయితే వీరిని గుర్తించడం కోసం ఎంఐటీ పరిశోధకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో పనిచేసే నూతన తరహా టెక్నాలజీని అభివృద్ధి చేశారు.
ఎంఐటీ పరిశోధకులు ఏప్రిల్ నుంచి కొన్ని రోజుల పాటు 70వేల మందికి చెందిన దగ్గు రికార్డింగ్స్‌ను సేకరించారు. మొత్తం 2 లక్షల దగ్గు రికార్డింగ్ శాంపిల్స్ ను వారు సేకరించారు. వాలంటీర్లు ఫోన్లు లేదా ఇతర డివైస్‌ల ద్వారా దగ్గుతూ ఆ శబ్దాలను రికార్డ్ చేసి ఆ శాంపిల్స్ ను ఎంఐటీ పరిశోధకులకు పంపారు. అయితే ఆ శాంపిల్స్ లో కొన్నింటితో వారు ఏఐ మోడల్‌ను రూపొందించారు. అనంతరం ఇంకొన్ని శాంపిల్స్ తో పరీక్షలు జరిపారు. కాగా సదరు ఏఐ మోడల్ ఆ దగ్గు రికార్డింగ్ శాంపిల్స్ ను పరీక్షించి 98.5 శాతం కచ్చితత్వంతో ఫలితాలను వెల్లడించింది.
వాలంటీర్లకు చెందిన దగ్గు రికార్డింగ్స్ ను పరిశీలించిన ఏఐ మోడల్ వారికి కోవిడ్ ఉందో, లేదో చెప్పేసింది. అలాంటి వారిలో లక్షణాలు లేని వారే ఎక్కువగా ఉండడం విశేషం. కోవిడ్ లక్షణాలు లేకున్నా పాజిటివ్ గా ఉన్న కొందరు తమ దగ్గు రికార్డింగ్స్ ను పంపారు. అయితే ఆ నమూనాలను విశ్లేషించిన ఏఐ మోడల్ వాలంటీర్ల దగ్గులను బట్టి వారికి కోవిడ్ ఉందో, లేదో చెప్పేసింది. ఈ క్రమంలో కోవిడ్ లక్షణాలు కనిపించనప్పటికీ చాలా మందికి ఏఐ మోడల్ నిర్వహించిన పరీక్షల ద్వారా పాజిటివ్ ఉన్నట్లు నిర్దారణ అయింది.
దాదాపుగా 98.5 శాతం కచ్చితత్వంతో సదరు ఏఐ మోడల్ ఫలితాలను వెల్లడించిందని ఎంఐటీ పరిశోధకులు తెలిపారు. అందువల్ల ఈ నూతన తరహా పరిజ్ఞానంతో క్షణాల్లోనే లక్షణాలు లేని వ్యక్తులకు కూడా కరోనా ఉందో, లేదో చెప్పేయవచ్చని వారు తెలిపారు. దీని వల్ల స్కూళ్లు, కాలేజీలు, ఇతర అనేక ప్రదేశాల్లో జనాలను పరీక్షించి కోవిడ్ వ్యాప్తిని అరికట్టవచ్చని అన్నారు. ఈ మోడల్‌ను ఒక యాప్ రూపంలో తెస్తే జనాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, అప్పుడు వారు ఎప్పటికప్పుడు దగ్గుతూ యాప్ ద్వారా తమకు కరోనా ఉందో, లేదో చెక్ చేసుకోవచ్చని అన్నారు. ఈ క్రమంలోనే వారు ప్రస్తుతం ఆ యాప్‌ను డెవలప్ చేసే పనిలో పడ్డారు.