ఐపీఎల్ 17 రెండు వరుస ఓటముల తరువాత లక్నో సూపర్ జెయింట్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. సొంత గడ్డపై తన ఆదిపత్యాన్ని చాటుతూ చెన్నై సూపర్ కింగ్స్ పై 8 వికెట్ల తేడాతో ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఘన విజయం సాధించింది. కే.ఎల్.రాహుల్ కెప్టెన్ ఇన్సింగ్స్ కి డికాక్ అర్థసెంచరీ తోడవ్వడంతో 177 పరుగుల లక్ష్యాన్ని లక్నో సులువుగా ఛేదించింది.
టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ కి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కి సరైన ఆరంభం లభించలేదు. రెండో ఓవర్ తొలి బంతికే ఓపెనర్ రచిన్ రవీంద్ర డకౌట్ అయ్యాడు. పవర్ ప్లేలో రహనే ధాటిగా ఆడినా.. మరోవైపు వికెట్లు పడటంతో చెన్నైకి ఇబ్బందులు తప్పలేదు. రహనే ఔట్ అయిన తరువాత జడేజా ఇన్నింగ్స్ ను నిలబెట్టగా.. చివర్లో మొయిన్ అలీ, ఎం.ఎస్. ధోనీ మెరుపులతో చెన్నై ఊహించని స్కోరు సాధించింది. 17 ఓవర్లకు చెన్నై చేసింది 123 పరుగులే. చివరిలో మొయిన్ అలీ(30) మూడు సిక్సర్లు, ధోని 28 పరుగులతో చెన్నై 176 పరుగులు చేయగలిగింది. లక్నో బ్యాటర్స్ ఎక్కడ తడబడకుండా అలవకగా లక్ష్యాన్ని ఛేదించారు.