ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బ్రాండ్ విలువ గత 7 సంవత్సరాలలో మొదటిసారిగా పడిపోయింది. స్వతంత్ర సలహా సంస్థ క్రోల్ బిజినెస్ డఫ్ అండ్ ఫెల్ప్స్ నివేదిక ప్రకారం 2020 లో ఐపీఎల్ బ్రాండ్ విలువ 3.6 శాతం తగ్గి రూ.45,800 కోట్లకు చేరుకుంది. ఇది 2019లో రూ.47,500 కోట్లుగా ఉంది. ఐపీఎల్ 13వ ఎడిషన్ మునుపటి సంవత్సరాలతో పోలిస్తే తక్కువ స్పాన్సర్షిప్ ఆదాయాన్ని చవి చూసింది. డ్రీమ్ 11 ఈ సీజన్‌కు రూ.222 కోట్లు చెల్లించింది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం వివో సీజన్‌కు రూ.440 కోట్లు ఇచ్చేది. అయితే గత సీజన్లో వివో ఆ కాంట్రాక్టును రద్దు చేసుకుంది.
వివో నిష్క్రమణతో బీసీసీఐకి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ ద్వారా తక్కువ స్పాన్సర్షిప్ ఆదాయం వచ్చింది. అలాగే కోవిడ్ మహమ్మారి కారణంగా లీగ్ సుమారుగా ఆరు నెలలు ఆలస్యం అయింది. దీంతోపాటు టోర్నమెంట్ మ్యాచ్‌లను స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండానే నిర్వహించారు. అలాగే కరోనా వైరస్ ప్రభావం కారణంగా ప్రకటనదారులు తక్కువ ఖర్చు చేశారు. దీంతో అన్ని విధాలుగా ఈసారి ఐపీఎల్ వల్ల బీసీసీఐకి ఆదాయం తగ్గింది. అలాగే ఐపీఎల్ బ్రాండ్ విలువ కూడా పడిపోయింది.
మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌తోపాటు ఇతర ఫ్రాంచైజీల విలువలు కూడా తగ్గాయి. 2019లో రూ.732 కోట్లుగా ఉన్న చెన్నై టీం విలువ 2020లో రూ.611 కోట్లకు పడిపోయింది. విలువలో 16.5 శాతం తగ్గుదల నమోదైంది. అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్ బ్రాండ్ విలువ 13.7 శాతం తగ్గింది. 2019లో రూ.629 కోట్లు ఉన్న బ్రాండ్ విలువ 2020లో రూ.543 కోట్లకు పడిపోయింది. ఇక రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ బ్రాండ్ విలువ స్వల్పంగా తగ్గింది. ఈ జట్టు బ్రాండ్ విలువ 2019లో రూ.809 కోట్లు ఉండగా 5.9 శాతం తగ్గి రూ.761 కోట్లకు పడిపోయింది.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా 13వ ఎడిషన్ ఐపీఎల్ వేదిక భారత్ నుండి యూఏఈకి మార్చబడింది. ఈ క్రమంలో ఫ్రాంచైజీలు రూ.400 కోట్ల మేర గేట్ ఆదాయాలను వదులుకోవాల్సి వచ్చింది. ఫ్రాంఛైజీలకు సంబంధించిన స్పాన్సర్షిప్ ఆదాయం తగ్గడం, గేట్ రశీదులు కోల్పోవడం, తగ్గిన ఆహారం, పానీయం (ఎఫ్ అండ్ బీ) ఆదాయం, కొన్ని జట్ల ఆన్-ఫీల్డ్ ప్రదర్శనల కారణంగా వ్యక్తిగత ఫ్రాంఛైజీలు తమ బ్రాండ్ విలువలను తగ్గించాయని నివేదికలో వెల్లడైంది.