బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడిన న్యూజిలాండ్‌.. తీవ్రంగా ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు..

ఇటీవ‌ల ఇంగ్లండ్‌తో జ‌రిగిన లీడ్స్ టెస్టు మ్యాచ్‌లో భార‌త్ త‌న తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 78 ప‌రుగులు మాత్ర‌మే చేసి ప‌రువు పోగొట్టుకుంది. అయితే స‌రిగ్గా అలాంటి అనుభ‌వ‌మే ఇప్పుడు న్యూజిలాండ్ జ‌ట్టుకు ఎదురైంది. బంగ్లాదేశ్ చేతిలో ఆ జ‌ట్టు దారుణ ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. బంగ్లాదేశ్ స్పిన్న‌ర్ల‌కు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ దాసోహం అయ్యారు.

bangladesh
bangladesh

బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య ఢాకాలో బుధ‌వారం జ‌రిగిన మొద‌టి టీ20 మ్యాచ్‌లో కివీస్‌పై బంగ్లా జ‌ట్టు 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కేవ‌లం 60 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. బంగ్లా బౌల‌ర్ల‌లో స్పిన్న‌ర్ల‌యిన‌ ముస్తాఫిజుర్ ర‌హ‌మాన్‌, మ‌హ‌మ్మ‌ద్ సైఫుద్దీన్‌, ష‌కిబ్ అల్ హ‌స‌న్‌, న‌సుమ్ అహ్మ‌ద్‌లు 9 వికెట్ల‌ను తీశారు. బంగ్లా స్పిన్న‌ర్ల ఎదుట కివీస్ బ్యాట్స్‌మెన్ నిల‌బ‌డ‌లేక‌పోయారు. దీంతో కివీస్ త‌క్కువ స్కోరుకే చాప చుట్టేసింది.

అనంత‌రం బంగ్లా జ‌ట్టు 15 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 62 ప‌రుగులు చేసి మ్యాచ్‌లో ఘ‌న విజ‌యం సాధించింది. అయితే ఈ విధంగా కివీస్ ను బంగ్లా జ‌ట్టు చిత్తు చేయ‌డంతో సోష‌ల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. నెటిజ‌న్లు కివీస్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మ‌రీ దారుణంగా ఓడిపోయార‌ని కామెంట్లు చేస్తున్నారు.

అయితే కొంద‌రు మాత్రం న్యూజిలాండ్ జ‌ట్టుకు మ‌ద్ద‌తుగా నిలిచారు. బంగ్లా జ‌ట్టు కేవ‌లం స్పిన్న‌ర్ల‌కు అనుకూలంగా ఉండే విధంగా పిచ్‌ను రూపొందించుకుంద‌ని, పిచ్‌లో నాణ్య‌త లేద‌ని, ఈ విష‌యాన్ని ఐసీసీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని కోరుతున్నారు. ఏది ఏమైనా బంగ్లా మాత్రం చాలా హ్యాపీగా ఉంది.