భారత్, ఇంగ్లండ్‌ల మధ్య ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో మ్యాచ్‌లను స్పిన్నర్లు డామినేట్ చేసిన విషయం విదితమే. రవిచంద్రన్ అశ్విన్ బంతితో అద్భుతంగా రాణించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. అశ్విన్ ఈ సిరీస్‌లో మొత్తం 32 వికెట్లను 14.71 సగటుతో తీశాడు. అలాగే మూడ సార్లు 5 వికెట్లను తీశాడు. ఇక మరో ఆఫ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ సిరీస్‌లో 10.59 సగటుతో 27 వికెట్లను తీశాడు. నాలుగు సార్లు 5 వికెట్లను తీశాడు. అయితే టెస్టు సిరీస్‌లో స్పిన్నర్ల డామినేషన్ ఎక్కువవడం, మ్యాచ్‌లు రెండు, మూడు రోజుల్లోనే ముగియడంతో ఇండియన్ పిచ్‌లపై మరోమారు కొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇండియా స్పిన్ పిచ్‌లు కాకుండా స్పోర్టింగ్ పిచ్‌లను ప్రిపేర్ చేయాలని ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ మైకేల్ వాన్ అన్నాడు. అంటే.. భారత్ సీమర్లకు అనుకూలించే పిచ్‌లను తయారు చేయాలని అతను చెప్పకనే చెప్పాడు. సాధారణంగా విదేశాల్లోని పిచ్‌లు సీమర్లకు అనుకూలిస్తాయి. వారు పేస్ బౌలింగ్‌కు అనుకూలించేలా పిచ్‌లను రూపొందించుకుంటారు. కానీ ఉప ఖండంలో పరిస్థితులు వేరు. భారత్, శ్రీలంక, పాక్ వంటి దేశాల్లో పిచ్‌లను స్పిన్నర్లకు అనుకూలించేలా తయారు చేస్తారు. ఎందుకంటే భారత్ సహా ఆయా ఉపఖండ దేశాలు స్పిన్‌లో బలమైనవి. కాబట్టే స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లను తయారు చేస్తారు. భారత్ చేసింది కూడా అదే. కొత్తగా ఏమీ చేయలేదు.
కానీ ఇంగ్లండ్ ప్లేయర్లు స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలం అవడం, మ్యాచ్ లు రెండు, మూడు రోజుల్లోనే ముగియడంతో వివాదాస్పదంగా మారింది. నిజానికి ఇందులో వివాదాస్పదం అయ్యేంత విషయం ఏమీ లేదు. లెజెండరీ ఆటగాడు సునీల్ గవాస్కర్ అయితే భారత పిచ్‌లకు మద్దతు పలికాడు. వాటి గురించి అనవసరంగా రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని విదేశీ మాజీలకు చురకలు అంటించాడు. అవును నిజమే. ఎందుకంటే.. భారత్ మాత్రమే కాదు, ఉపఖండం జట్లు ఏవైనా సరే విదేశాల్లో ఆడేటప్పుడు తడబడతాయి. కారణం ఆ పిచ్‌లు సీమర్లకు అనుకూలించడమే. మనవాళ్లు సీమర్లను అంత సమర్థవంతంగా ఎదుర్కొనలేరు. అలా అని చెప్పి అక్కడి పిచ్‌లు బాగా లేవని వారు ఎన్నడూ ఇలా ఫిర్యాదు కూడా చేయలేదు. అలాంటప్పుడు భారత్ పిచ్‌లపై ఇప్పుడే పలువురు మాజీ ఎందుకు నానా యాగీ చేస్తున్నారో అర్థం కావడం లేదు.
ఏ దేశం అయినా సరే అక్కడికి విదేశీ ఆటగాళ్లు టూర్‌కు వెళ్లినప్పుడు సహజంగానే ఆతిథ్యం ఇచ్చే జట్టు హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. పిచ్‌లను తమకు అనుకూలంగా రూపొందించుకుంటారు. క్రికెట్ ఆడే ఏ దేశమైనా ఇలాగే చేస్తుంది. భారత్ కూడా ఇలాగే చేసింది. స్పిన్ మనకు బలం కాబట్టి అవే పిచ్‌లను రూపొందించారు. ఇకపై కూడా అలాగే చేస్తారు. అయితే దురదృష్టవశాత్తూ ఈసారి ఇంగ్లండ్ ప్లేయర్లు సరిగ్గా ఆడలేదు. అందుకు భారత్‌ను పిచ్‌లు బాగా లేవని నిందించడం సరికాదు. నిజానికి రిషబ్ పంత్‌తోపాటు అశ్విన్, అక్షర్ పటేల్ లాంటి బౌలర్లు కూడా మన పిచ్‌లపై బాగానే ఆడారు. అలాంటిది హేమా హేమీలు అని చెప్పుకునే ఇంగ్లండ్ ప్లేయర్లు ఆడలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అదేదో సామెత చెప్పినట్లు.. ఆడలేక పిచ్‌లు బాగా లేవని అనడం వారికే చెల్లింది. ఇకనైనా పిచ్‌లపై కాకుండా ఆటపై దృష్టి పెడితే బాగుంటుంది.