పోరాడి ఓడిన బంగ్లాదేశ్‌.. 106 ప‌రుగుల భారీ తేడాతో గెలిచిన ఇంగ్లండ్‌..

-

ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 టోర్నీలో సౌతాఫ్రికాపై నెగ్గిన‌ ఉత్సాహంతో ఉన్న బంగ్లాదేశ్ ఆ త‌రువాత న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఓట‌మి పాలైంది. ఇక ఇవాళ ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ బంగ్లాదేశ్ చివ‌రి వ‌ర‌కు పోరాట ప‌టిమ‌ను ప్ర‌ద‌ర్శించింది. అయిన‌ప్ప‌టికీ ఆ జ‌ట్టు ఓట‌మి పాలైంది. ఇవాళ కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 టోర్నీ 12వ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జ‌ట్టు బంగ్లాదేశ్‌పై 106 ప‌రుగుల భారీ తేడాతో ఘ‌న విజ‌యం సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో 2వ స్థానానికి చేరుకుంది.

ఇంగ్లండ్ నిర్దేశించిన 387 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో బంగ్లా బ్యాట్స్‌మెన్ చ‌క్క‌ని ఆట‌తీరును క‌న‌బ‌రిచారు. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో షకిబ్ అల్ హసన్ (119 బంతుల్లో 121 పరుగులు, 12 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీ సాధించాడు. అలాగే వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ముష్ఫికుర్ రహీం (50 బంతుల్లో 44 పరుగులు, 2 ఫోర్లు) కూడా పోరాడాడు. అయినప్పటికీ బంగ్లాదేశ్ ఛేదించాల్సిన లక్ష్యం భారీగా ఉండడంతో ఆ జట్టు పరుగులు తీయ‌డంలో వెనుకబడి పరాజ‌యం పాలైంది. దీంతో బంగ్లాదేశ్ జట్టు 48.5 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ చెరో 3 వికెట్లు తీశారు. అలాగే మార్క్ వుడ్ కు 2 వికెట్లు దక్క‌గా, ప్లంకెట్, రషీద్‌లు చెరో వికెట్ తీశారు.

ఇక అంత‌కు ముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ దూకుడుగా ఆడారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 386 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లలో జాసన్ రాయ్ (121 బంతుల్లో 153 పరుగులు, 14 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. అలాగే జాస్ బట్లర్ (44 బంతుల్లో 64 పరుగులు, 2 ఫోర్లు, 4 సిక్సర్లు), జానీ బెయిర్‌స్టో (50 బంతుల్లో 51 పరుగులు, 6 ఫోర్లు)లు కూడా రాణించారు. కాగా బంగ్లాదేశ్‌ బౌలర్లలో మహమ్మద్ సైఫుద్దీన్, మెహిదీ హసన్‌లు చెరో 2 వికెట్లు తీయ‌గా, కెప్టెన్ మష్రఫె మొర్తాజా, ముస్తాఫిజుర్ రహమాన్‌లకు చెరొక వికెట్ దక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news