చెస్​ ఒలింపియాడ్​లో అదరగొట్టిన భారత్​..

-

భారత్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తొలిసారి ఆతిథ్యమిచ్చిన చెస్‌ ఒలింపియాడ్‌ ముగిసింది. ఓపెన్‌, మహిళల విభాగాల్లో మన జట్లకు కాంస్యాలు దక్కాయి. 187 దేశాల నుంచి ఈ రెండు విభాగాల్లో కలిపి దాదాపు 350 జట్లు బరిలో దిగాయి. తీవ్ర పోటీని తట్టుకుని.. అగ్రశ్రేణి జట్లను వెనక్కినెట్టి పతకాలు సాధించడమంటే చిన్న విషయం కాదు. బోర్డుపై ప్రత్యక్షంగా జరిగిన చెస్‌ ఒలింపియాడ్‌లను చూసుకుంటే ఓపెన్‌లో ఇది భారత్‌కు రెండో కాంస్యం. 2014లో తొలి పతకం దక్కింది. ఇక 1978లో ఒలింపియాడ్‌లో మహిళల విభాగంలో అడుగుపెట్టిన భారత్‌.. ఇప్పుడే మొదటి పతకం అందుకుంది.

భారత్‌ 75 ఏళ్ల స్వాతంత్య్ర అమృతోత్సవాలు వేళ.. దేశంలో గ్రాండ్‌మాస్టర్ల సంఖ్య కూడా 75 ఉండడం విశేషం. 1988లో ఆనంద్‌ మొట్టమొదటి గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం)గా మారినప్పటి నుంచి.. ఇటీవల చెన్నై కుర్రాడు ప్రణవ్‌ జీఎంగా ఎదగడం వరకూ దేశం ఆటలో ఎంతో ముందుకు వెళ్లింది. 2007లో 20గా ఉన్న గ్రాండ్‌మాస్టర్ల సంఖ్య ఇప్పుడు మూడింతలు దాటింది. ప్రస్తుతం 2700 ఎలో రేటింగ్‌ క్లబ్‌లో దేశం నుంచి ఆనంద్‌ (2756), అర్జున్‌ (2754), హరికృష్ణ (2716), విదిత్‌ గుజరాతి (2710), గుకేశ్‌ (2725) ఉన్నారు. అయిదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్న దేశంగా భారత్‌.. యుఎస్‌ఏ (6), రష్యా (10), చైనా (5) లాంటి దేశాల సరసన చేరింది.

దేశంలో చదరంగానికి ఆదరణ భారీగా పెరిగింది. ఒలింపియాడ్‌లో ఒక్కో విభాగంలో భారత్‌ ఏకంగా మూడు జట్లను బరిలో దింపిందంటే మన క్రీడాకారుల ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మారుమూల పల్లెటూరు.. దేశ రాజధాని లాంటి తేడాల్లేకుండా చెస్‌ విస్తరిస్తోంది. 64 గళ్ల బోర్డు.. 32 పావులు.. ఇద్దరు ప్రత్యర్థులు ఉంటే చాలు.. ఎక్కడైనా, ఎప్పుడైనా ఆడుకోవచ్చు. దేశంలో దాదాపు 50 వేల మంది ఆటగాళ్లు అధికారికంగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కనీసం పది లక్షల మంది దేశవ్యాప్తంగా స్థానిక టోర్నీల్లో పోటీపడుతున్నారు. అఖిల భారత చెస్‌ సమాఖ్య ప్రతి ఏడాది అండర్‌-7 నుంచి మొదలెట్టి వివిధ స్థాయిల్లో కలిపి మొత్తం 20 జాతీయ ఛాంపియన్‌షిప్స్‌ నిర్వహిస్తోంది. మరోవైపు చెస్‌ లీగ్‌ ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భవిష్యత్తులో భారత్‌దే ఆధిపత్యం అనేందుకు ఇవన్నీ సంకేతాలుగా కనిపిస్తున్నాయి.

44వ చెస్‌ ఒలింపియాడ్‌ను విజయవంతంగా నిర్వహించిన తమిళనాడు ప్రభుత్వాన్ని, ఇందులో పతకాలు గెలిచిన భారత జట్లను ప్రధాని మోదీ బుధవారం అభినందించారు. “44వ చెస్‌ ఒలింపియాడ్‌కు తమిళనాడు ప్రజలు, అక్కడి ప్రభుత్వం గొప్పగా ఆతిథ్యమిచ్చింది. ప్రపంచానికి స్వాగతం పలికి మన సంస్కృతి, ఆతిథ్యాన్ని చాటిచెప్పినందుకు అభినందిస్తున్నా. ఈ ఒలింపియాడ్‌లో భారత్‌ ప్రోత్సాహకరమైన ప్రదర్శన చేసింది. కాంస్యాలు నెగ్గిన భారత పురుషుల-2, మహిళల-1 జట్లకు శుభాకాంక్షలు. ఇది భారత్‌లో చెస్‌ భవిష్యత్‌కు మంచి సూచన. అసాధారణ ఆటతీరుతో వ్యక్తిగత పతకాలు సాధించిన ప్లేయర్లకూ అభినందనలు” అని ఆయన ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news