హతవిధీ.. మరీ 224 పరుగులేనా..?

-

వన్డే ప్రపంచ కప్‌లో విజయాల పరంపరతో దూసుకెళ్తున్న భారత జట్టుకు ఆఫ్గనిస్థాన్ షాకిచ్చింది. ఇవాళ సౌతాంప్టన్‌లో జ‌రుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 224 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆఫ్గన్ బౌలర్లు తమ బౌలింగ్‌తో భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టుదిట్టం చేశారు. ఎప్పటికప్పుడు వికెట్లను తీస్తూ టీమిండియాను కోలుకోలేని దెబ్బ తీశారు.

భారత బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ కోహ్లి (63 బంతుల్లో 67 పరుగులు, 5 ఫోర్లు), కేదార్ జాదవ్ (68 బంతుల్లో 52 పరుగులు, 3 ఫోర్లు, 1 సిక్సర్)లు తప్ప మిగిలిన ఎవరూ రాణించలేకపోయారు. ఈ క్రమంలో ఆఫ్గనిస్థాన్ బౌలర్లలో కెప్టెన్ గుల్బదిన్ నయీబ్, మహమ్మద్ నబీలకు చెరో 2 వికెట్లు దక్కగా, ముజీబ్ ఉర్ రహమాన్, అఫ్తాబ్ ఆలం, రషీద్ ఖాన్, రహ్మత్ షాలకు తలా 1 వికెట్ దక్కింది.

మొదట బ్యాటింగ్ చేస్తే భారీ ఎత్తున స్కోర్ చేసి ఆఫ్గనిస్థాన్‌పై పెద్ద ఎత్తున పరుగుల తేడాతో గెలిచి రన్‌రేట్ మెరుగు పరుచుకోవచ్చని భారత్ భావించి టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత్ అంచనాలు తారుమారయ్యాయి. వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్లే ఔటయ్యారు. కొంత సేపు క్రీజులో ఉందామనుకున్నా ఆఫ్గనిస్థాన్ స్పిన్నర్లకు దొరికిపోయారు. దీంతో భారత్ చాలా తక్కువ స్కోరు నమోదు చేసింది. అయితే ఇవాళ మ్యాచ్ జరుగుతున్న సౌతాంప్టన్ పిచ్ బౌలింగ్ పిచ్ కావడంతో భారత బౌలర్లు రాణిస్తే ఆఫ్గనిస్థాన్‌ను ఓడించవచ్చు. మరి ఈ మ్యాచ్‌లో ఆఫ్గనిస్థాన్ భారత బౌలింగ్ అటాక్‌ను తట్టుకుని నిలబడగలుగుతుందా, మ్యాచ్ గెలుస్తుందా.. అన్నది తెలియాలంటే.. మరికొద్ది గంటలు వేచి చూడక తప్పదు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version