భారత్, దక్షిణాఫ్రికా మధ్య రాంచీ వేదికగా శనివారం మొదలైన మూడో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా జరుగుతోంది. ఇటీవల ముగిసిన వైజాగ్, పుణె టెస్టులో టీమిండియాకి పోటీనివ్వలేకపోయిన సఫారీ బౌలర్లు.. రాంచీలో మాత్రం తొలి సెషన్‌లోనే మూడు వికెట్లు పడగొట్టి ఒత్తిడిలోకి నెట్టేశారు. కాగా, మూడో టెస్టు మ్యాచులో బ్యాటింగ్ చేస్తోన్న భారత్ 40 ఓవర్లకి 3 వికెట్ల నష్టానికి 150 పరుగులతో క్రీజులో ఉంది. అంతకు ముందు 10 ఓవర్లలోపే టాప్ ఆర్డర్ కుప్పకూలింది. మయాంక్ అగర్వాల్ (19 బంతుల్లో 10 పరుగులు), ఛటేశ్వర పుజారా(9 బంతుల్లో 0 పరుగులు) కే రబాడ బౌలింగ్ లో వెనుదిరిగారు.
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కూడా (22 బంతుల్లో 12 పరుగులు) అన్రిచ్ నొర్జే బౌలింగ్ లో తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో భారత్ కష్టాల్లో పడిందని అంతా భావించారు. అయితే, క్రీజులో నిలదొక్కుకున్న రోహిత్ శర్మ, అజింక్యా రహానె ధాటిగా ఆడుతున్నారు. ప్రస్తుతం రోహిత్ 77, రహానె 50 పరుగులతో క్రీజులో ఉన్నారు.