రికార్డుల రారాజు ఖాతాలో నయా రికార్డు

ఫార్మాట్ ఏదైనా, టోర్నీ ఏదైనా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ బ్యాట్ కు తిరుగుండదు. ఎన్ని పరుగులు చేసినా కోహ్లీ పరుగుల దాహం మాత్రం తీరదు. ఇప్పటికే వన్డే, టెస్ట్, టీ 20లో ఎన్నో రికార్డులు సృష్టించిన కోహ్లీ ఐపీఎల్ లోనూ తనకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు. తాజాగా గురువారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో 72 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో 6 వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

 

ప్రస్తుతం ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ జాబితాలో కోహ్లీ (6021)తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో 5 సెంచరీలు కూడా ఉన్నాయి. అత్యధిక సెంచరీల జాబితాలో విండీస్ వీరుడు క్రిస్ గేల్ 6 శతకాలతో తొలిస్థానంలో ఉన్నాడు. అత్యధిక పరుగుల జాబితాలో కోహ్లీ తరువాత సురేష్ రైనా (5448), శిఖర్ ధావన్ (5428) వరుసగా రెండు, మూడో స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఇక ఈ మ్యాచ్ లో రాజస్థాన్ విధించిన 178 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు వికెట్ కోల్పోకుండా ఛేదించింది. ఐపీఎల్లో వికెట్ కోల్పోకుండా ఛేదించిన భారీ లక్ష్యాల్లో ఇది మూడోది. దీనికంటే ముందు 2017లో గుజరాత్‌ లయన్స్‌ విధించిన 184 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్లు గంభీర్‌, క్రిస్‌లిన్‌లు వికెట్‌ పడకుండా ఛేదించారు. అలానే 2020లో పంజాబ్ విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని చెన్నై ఓపెనర్లు వాట్సన్‌, డుప్లెసిస్‌లు వికెట్ కోల్పోకుండా ఛేదించారు.

ఇక ఈ మ్యాచ్‌లో దేవ్‌దత్‌ పడిక్కల్‌తో కలిసి కోహ్లీ 181 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఇది బెంగళూరుకు ఉత్తమ ఓపెనింగ్‌ భాగస్వామ్యం. దీనికంటే ముందు పూణే వారియర్స్ పై గేల్‌, దిల్షాన్‌లు 167 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఈ మ్యాచ్ లో దేవ్‌దత్‌ పడిక్కల్‌ 101 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో తన ఐపీఎల్ కెరీర్ లో తొలి సెంచరీ నమోదు చేసాడు. ఇక ఈ సీజన్ లో నమోదైన తొలి సెంచరీ కూడా ఇదే.